రంజాన్‌కా తోఫా

Telangana Government Ramadan Gift Pack For Muslims - Sakshi

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌ : ఏటా మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేయనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుపేదలు అందరిలాగే రంజాన్‌ పర్వదినం జరుపుకోవాలనే ఉద్దేశంతో దుస్తులు పంపిణీ చేస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం కూడా జిల్లాలో 12వేల మందికి దుస్తులు అందజేయనున్నారు. ఇప్పటికే దుస్తుల ప్యాకెట్లు జిల్లా   కేంద్రానికి చేరుకున్నాయి. 

నియోజకవర్గాల వారీగా పంపిణీ 
రంజాన్‌ను పురస్కరించుకుని నిరుపేద ముస్లింలకు ఇచ్చే ఒక్కో ప్యాకెట్‌లో కుటుంబ యాజమానికి లాల్చీ, పైజమా, యజమాని భార్యకు చీర, యువతి షర్ట్, సల్వార్‌ ఉంటుంది. అయితే, ఇవన్నీ కూడా క్లాత్‌ రూపంలోఉంటాయి. ఇందులో చీర తప్ప మిగతావన్నీ కుట్టించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లాకు 12 వేల ప్యాకెట్లు చేరుకోగా జిల్లా కేంద్రంలోని ప్రీమెట్రిక్‌ హాస్టల్‌లో భద్రపరిచారు. ఇక్కడి నుంచి నియోజకవర్గాల వారీగా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు పంపిస్తున్నారు. ఈ దుస్తుల ప్యాకెట్లను మజీద్‌ కమిటీల ఆధ్వర్యాన ఎంపిక చేసిన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. 

ఇఫ్తార్‌ విందులకు రూ.24లక్షలు 
ప్రభుత్వం తరపున అధికారికంగా ముస్లింలకు ఇఫ్తార్‌ విందులు ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం జిల్లాకు రూ.24లక్షలు కేటాయించారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

నియోజకవర్గ కేంద్రాలకు పంపిస్తున్నాం...
దుస్తుల ప్యాకెట్లను జిల్లా కేంద్రం నుంచి నియోజకవర్గాలకు పంపిస్తున్నాం. నిరుపేద ముస్లింల ఎంపిక బాధ్యత ఆయా మసీద్‌ కమిటీలకు అప్పగించాం. ఇఫ్తార్‌ విందులకు జిల్లాకు రూ.24లక్షలు మంజూరయ్యాయి. వచ్చేనెల మొదటి లేదా రెండో వారంలో విందు ఏర్పాటు చేయనున్నాం. 
– వెంకటేశ్వర్లు, జిల్లా మైనార్టీశాఖ అధికారి 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top