ఎంతో ప్రగతి సాధించాం : సీఎం కేసీఆర్‌

Telangana Formation Day : CM KCR Pays Tribute To Telangana Martyrs - Sakshi

ఆశావహంగా రాష్ట్ర ప్రయాణం ప్రారంభమైంది... ఆశించినట్లే సమస్యలు తీరుతున్నాయి

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్‌

ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ... అంతకుముందు అమరవీరుల స్థూపానికి నివాళి  

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పడే నాటికి రైతుల పరిస్థితి, వ్యవసాయం దారుణంగా ఉండేవని, నేడు తెలంగాణ వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారని, నేడు మిషన్‌ భగీరథతో ఆ సమస్య పరిష్కారమైందన్నారు. విద్యుత్, సాగునీరు, విద్య, వైద్యం, పారిశ్రామిక, ఐటీ తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతిభవన్‌లో జెండా ఎగురవేస్తున్న సీఎం 

ప్రజాసంక్షేమానికి పునరంకితమవుతాం... 
తెలంగాణ రాష్ట్ర ప్రయాణం అనుకున్న రీతిలో ఎంతో ఆశావహంగా ప్రారంభమైందని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడేందుకు ప్రభుత్వం పునరంకితం అవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జె.సంతోష్‌ కుమార్, కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, అనురాగ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు, మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, నాగేందర్, ఆత్రం సక్కు, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. 

జెండావిష్కరణ అనంతరం సెల్యూట్‌ చేస్తున్న  సీఎం కేసీఆర్, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి 

ట్విట్టర్‌లో రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు... కృతజ్ఞతలు తెలిపిన సీఎం 
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, సినీనటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. కోవింద్, మోదీ, అమిత్‌ షా, చిరంజీవి తెలుగులో శుభాకాంక్షల ట్వీట్లు చేయగా వెంకయ్య నాయుడు ఉర్దూలో ట్వీట్‌ చేశారు. వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఆకాంక్షించినందుకు రాష్ట్ర ప్రజల తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు’అని సీఎం పేర్కొన్నారు.
    
రాష్ట్ర అవతరణపై ప్రముఖుల శుభాకాంక్షల ట్వీట్లు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్‌ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్‌ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.  – రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 

తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ  శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాల్లో తమ ప్రతిభ చాటుతున్నారు. దేశ ప్రగ తిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్థిస్తున్నాను. – ప్రధాని మోదీ 

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. పుష్కలంగా సహజ వనరులు, గర్వించదగిన చరిత్ర కలిగిన విభిన్న భాషలు, సంస్కృతుల సమ్మేళనం. భారతీయ గంగా–జము నా తెహజిబ్‌కి తెలంగాణ ప్రతీక. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నా.   – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 

ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత కేసీఆర్‌కు, యావత్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. – సినీనటుడు చిరంజీవి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top