ముహూర్తం ఖరారు

Telangana Final Voters List Release Today - Sakshi

మెదక్‌ అర్బన్‌ : ఎట్టకేలకు ఓటర్ల తుది జాబితా విడుదలకు సమయం ఖరారైంది. హై కోర్టు 12వ తేదీన ఫైనల్‌ జాబితాను ప్రకటించాలిని తీర్పునిచ్చింది. దీంతో జిల్లా రెవెన్యూ అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశారు.  హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా అధికారులు ఓటర్ల తుది జాబితా తయారీకి కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే సెప్టెంబర్‌ 10వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఆ తర్వాత 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో సవరణలకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.

అక్టోబరు 8వ తేదీన ఓటర్ల తుదిజాబితాను ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో లోపాలు ఉండగా ఎన్నికలు ఎలా? నిర్వహిస్తారంటూ? కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణ జరిపిన కోర్టు ఈనెల 12వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటించేందుకు ఆమోదం తెలిపింది. ఈ తీర్పుతో జిల్లా రెవెన్యూ అధికారులు సవరణలు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేసి 12వ తేదీన ఫైనల్‌ జాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఓటరు నమోదులో కొత్తగా పేర్ల నమోదు, తొలగింపులు, పేర్లలో తప్పులు, సవరణలు, పోలింగ్‌ స్టేషన్లలో మార్పులకు సంబం«ధించి ఈనెల 25 వరకు ప్రభుత్వం గడువు విధించింది.

ఈ మేరకు  గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ బూత్‌లెవల్‌ అధికారులు (బీఎల్‌ఓ)లు వివరాలు సేకరించారు. అధికారులు, బూత్‌ లెవల్‌ సిబ్బంది చేపట్టిన ఓటరు జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 3,92,606 మంది మొత్తం ఓటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఆయా గ్రామాల్లోని పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో పేర్లు లేని వారు కొత్తగా పేర్లు నమోదు చేసుకోవడం, రెండు చోట్ల ఓట్లు ఉంటే ఒక చోట తొలగించడం, పేర్లలో తప్పులు, సవరణలుకు నమోదు చేసుకున్నారు. 

వారిదే హవా..
కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు (చేర్పులు, మార్పులు ) 33,191, ఫామ్‌–6 ద్వారా 26,639, ఫామ్‌–7 ద్వారా 3,693 , ఫామ్‌–8 ద్వారా 1,657, ఫారం–8ఏ ద్వారా 1,202 దరఖాస్తులు వచ్చాయి. అయితే వాటిలో  పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఇతరత్రా దరఖాస్తులను పరిష్కరించారు.  జిల్లా వ్యాప్తంగా మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో సిబ్బంది సెప్టెంబర్‌ 10వ తేదీ వరకు ముసాయిదా జాబితా ప్రకారం మెదక్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,82,464 ఉంది. అలాగే నర్సాపూర్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,88,909 మంది ఉన్నారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుదిజాబితా కసరత్తు చేపట్టాలని ఆదేశించడంతో బూత్‌ లెవల్‌ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు పూర్తి కసరత్తును ప్రారంభించారు. ఈ మేరకు మెదక్‌ జిల్లాలోని మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య, అందులో మహిళలు, పురుషుల వివరాలను సేకరించారు. జిల్లా వ్యాప్తంగా మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 3,92,606 మంది ఉన్నారు. దీనిలో రెండు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉండటం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top