కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌ | Telangana CM KCR Takes Key Decisions | Sakshi
Sakshi News home page

Dec 16 2018 7:19 PM | Updated on Dec 16 2018 7:55 PM

Telangana CM KCR Takes Key Decisions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత హయాంలో తెలంగాణలోని పది జిల్లాలను.. 31 జిల్లాలుగా పునర్విభజించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు జిల్లాలు ఏర్పాటుచేస్తే.. తెలంగాణలోని జిల్లాల సంఖ్య 33కు చేరుతుంది.
ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఆదివారం పంచాయతీరాజ్ అంశాలతోపాటు, ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, రాజేశ్వర్ తివారి, రామకృష్ణారావు, వికాస్ రాజ్, స్మితా సభర్వాల్, నీతూ ప్రసాద్, రఘునందన్ రావు, పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు.

కొత్తగా 9355 మంది గ్రామ కార్యదర్శుల నియామకం
రాష్ట్రంలోని 12,751 గ్రామాలకు,  ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ కార్యదర్శిని నియమించడం కోసం కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా చేపట్టిన మొదటి నియామక ప్రక్రియ కూడా ఇదే. నియామక ప్రక్రియ కూడా ముగిసింది.  నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రూపొందించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కొత్త గ్రామ కార్యదర్శుల నియామకంతో గ్రామాలన్నింటికీ అధికారులు ఉంటారని, వీరి ద్వారా గ్రామాభివృద్ధి, పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.



27న పంచాయతీరాజ్ అవగాహన సదస్సు
కొత్తగ నియామకమైన గ్రామ కార్యదర్శులు, ఇప్పటికే ఉన్న పంచాయతీకార్యదర్శులతో కలిసి మొత్తం 12,751 వేల మంది గ్రామ కార్యదర్శులు, ఎంపిడివోలు, ఇవోపిఆర్డిలు, డిపిఓలు, డిఎల్పీఓలతో కలిపి ఈ నెల 27న ఎల్.బి. స్టేడియంలో అవగాహన సదస్సు నిర్వహించాలని  ఈ సమీక్షలో నిర్ణయించారు. అధికారులంతా మద్యాహ్నం 12 గంటల వరకు ఎల్.బి. స్టేడియం చేరుకుంటారు. మద్యాహ్న భోజన అనంతరం 2 గంటలకు సదస్సు ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారభోపన్యాసం చేస్తారు. గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తారు.

57 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్లు
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని, అర్హులను ఎంపిక చేయాలని సిఎస్ ను ఆదేశించారు. లబ్దిదారుల లెక్క తేలిన తర్వాత 2019-20 బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులు కేటాయించి, ఏప్రిల్ మాసం నుంచి పెన్షన్లు అందివ్వాలని చెప్పారు.
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు  చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారిని ఆదేశించారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లయింది. కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లాలోని మల్లంపల్లి మండలాలను ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని సూచించారు.

19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన చీరలను ఈ నెల 19 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగానే పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు వల్ల ఆగిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు పంచే దుస్తులతో పాటు బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఎమ్మెల్యేల ద్వారా కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులు
కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను తిరిగి ఎమ్మెల్యేల ద్వారానే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా కొద్దిరోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇప్పుడు తిరిగి పాత పద్ధతిలోనే ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేయాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement