త్వరలో తెలంగాణ బీసీ కమిషన్

త్వరలో తెలంగాణ బీసీ కమిషన్


వెంటనే ప్రక్రియ ప్రారంభానికి సీఎం ఆదేశం

బాలబాలికలకు చెరి సగం స్కూళ్ల కేటాయింపు

బీసీ సంక్షేమంపై సమీక్షలో కేసీఆర్ నిర్ణయాలు


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీల ప్రస్తుత స్థితిగతులను పరిశీలించి ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే కేబినెట్ సమావేశమై బీసీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను చర్చిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బలహీన వర్గాల ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని...అందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి వచ్చే బడ్జెట్లో బీసీ సంక్షేమానికి నిధులు కేటాయిస్తామన్నారు. బీసీ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.


బీసీ కులాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో త్వరలోనే విసృ్తత స్థాయి సమావేశం నిర్వహించి బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి తీసుకునే చర్యలపై వారితో చర్చించనున్నట్లు వెల్లడించారు. నిరుపేద బీసీల సామాజిక ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బీసీల సంక్షేమం పేరిట గతంలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలు హాస్యాస్పదంగా, నామమాత్రంగా ఉన్నాయని కేసీఆర్ విమర్శించారు.


బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడేలా ప్రభుత్వ ఆర్థిక సహాయ కార్యక్రమాలు వాస్తవికంగా ఉండాలని... దీనిపై సమగ్ర అధ్యయనం చేసి అందుకు అవసరమైన కార్యక్రమాలను రూపొందించాలన్నారు. సమావేశంలో మంత్రి జోగు రామన్న, సీఎం ముఖ్య కార్యదర్శి సి.నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 ప్రతి నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్

బీసీ విద్యార్థులకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. మొదటి దశలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభించాలని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలోనే ఈ పాఠశాలలు ప్రారంభం కావాలని, వీటిలో సగం బాలురకు, సగం బాలికలకు కేటాయించాలన్నారు. వచ్చే జూన్ నాటికే ఈ పాఠశాలలకు అవసరమయ్యే బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, విద్యార్థుల చేరిక, వసతి తదితర ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిలబస్, ఇతర విద్యా సంబంధ అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు.


బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం, దుస్తులు, పుస్తకాలు ఉచితంగా అందించాలన్నారు. ఆట స్థలంతోపాటు మంచి ప్రాంగణాన్ని బీసీ గురుకులాలకు సిద్ధం చేయాలని చెప్పారు. సమాజంలో సగ భాగం ఉన్న బీసీల పురోగతి వారి పిల్లలకు మంచి విద్యను అందించటం ద్వారా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. బీసీల పిల్లల చదువుకు ఎంత ఖర్చయినా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.


రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మైనారిటీ గురుకులాలు నిర్వహిస్తున్న విధంగానే బీసీ గురుకుల పాఠశాలలు నడవాలని, అందుకు నిబద్ధత కలిగిన అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిం చారు. పాఠశాలలకు ఇప్పట్నుంచే స్థలాన్వేషణ జరపాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్ల పరిస్థితి, భవనాలు, స్థలాలు తదితర అంశాలపైనా అధ్యయనం చేయాలని... వాటిని గురుకులాలుగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించాలని ఆయన సూచించారు.


అకాడమీల తరహాలో స్టడీ సర్కిళ్లు

రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్లు నామమాత్రంగానే ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. బీసీ స్టడీ సర్కిళ్లతోపాటు అన్ని స్టడీ సర్కిళ్లలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు కచ్చితంగా ఉద్యోగం సంపాదించేలా అకాడమీల తరహాలో వాటిని నిర్వహించాలన్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.


నిజామాబాద్, కరీంనగర్‌లలో పోలీస్ కమిషనరేట్లు

నిజామాబాద్, కరీంనగర్ నగరాల్లో కొత్తగా పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు శాఖను ఆదేశించారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లుగా ఉన్న ఈ రెండు నగరాల్లో జనాభా తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని పోలీసు శాఖను పటిష్టం చేయాలని ఆయన సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top