సొంతూరుకు సీఎం..

Telagana CM KCR Coming To Medak - Sakshi

సపరివార సమేతంగా చింతమడక గ్రామానికి..

గ్రామంలో పర్యటించనున్న కేసీఆర్‌

తమ కళ్ల ఎదుటే తిరిగిన వ్యక్తి నేడు ముఖ్యమంత్రి హోదాలో ఆత్మీయంగా, ఆప్యాయంగా పలకరించనున్నాడనే ఆనందం కొందరిలో.. తమతో ఆటలు ఆడి, పాటలు పాడిన బాల్యమిత్రుడు వస్తున్నాడనే సంతోషం మరి కొందరిలో..  వెరసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో చింతమడక గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముఖ్యమంత్రి గ్రామంలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య  శోభారాణి, కుమారుడు కేటీఆర్‌ ఇతర కుటుంబ సభ్యులు రానున్నారు.  గ్రామ ప్రజలతో సభ, ఆత్మీయ సమావేశం, సహపంక్తి భోజనం, పలు అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన,  ప్రారంభోత్సవాల సందడితో చింతమడక మురవనుంది.   ఆదివారం పర్యటన ఏర్పాట్లను  మాజీ మంత్రి హరీశ్‌రావు,  కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు.   

సాక్షి, సిద్దిపేట: సీఎం కేసీఆర్‌ గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అభివృద్ధి, సంక్షేమ పథకాల నిర్వహణను పూర్తి చేసింది. గ్రామంలో రూ.20 కోట్లతో బీసీ సంక్షేమ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అలాగే అర్హులైన నిరుపేదలకు 54 డబుల్‌ బెడ్రూం ఇళ్లను సీఎం చేతుల మీదుగా  పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ప్రైమరీ స్కూల్‌ భవన నిర్మాణం, పెద్దమ్మ దేవాలయం, రామాలయం వాటిని ప్రారంభించనున్నారు.  మరోవైపు గ్రామంలో ప్రతీ ఒక్కరికి రేషన్‌ కార్డును అందించేందుకు ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ పరమైన సమస్యలు ఉండకుండా ఇప్పటికే రెవెన్యూ అధికారులు, కుటుంబ సర్వే ఆధారంగా పూర్తి నివేదికను తయారు చేశారు.

చిన్నప్పటినుంచే అన్నింటా దిట్ట..
చిన్నతనం నుంచే కేసీఆర్‌ అన్ని రంగాల్లో చలాకీగా ముందు ఉండేవాడు. దుబ్బాక పాఠశాలలో చదువుకునే రోజుల్లో క్లాస్‌లో మొదటి వరసలో కూర్చొని  శ్రద్ధగా పాఠాలను వినేవాడు. పరీక్షలకు కూడా సన్నద్ధం కాకుండా పరీక్షలు రాసి మంచి మార్కులు పొందేవాడు.  కేసీఆర్‌ మొదట 5వ తరగతి వరకు గ్రామంలో చదువుకున్నప్పటికీ, అనంతరం తొమ్మిది వరకు దుబ్బాకలో చదువుకున్నాడు. అనంతరం 10వ తరగతి పుల్లూరులో, ఇంటర్మీడియట్‌ సిద్దిపేటలో పూర్తి చేశాం.  నేను కేసీఆర్‌తో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నాను. తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ఊరు రుణం తీర్చుకోవడానికి సీఎం హోదాలో  గ్రామానికి వస్తుండడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.          
 –భైరి కృష్టారెడ్డి, కేసీఆర్‌ స్నేహితుడు

గ్రామ రూపురేఖలు మారుతున్నాయి..
చాలా రోజుల తరువాత చింతమడక బిడ్డ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడంతో గ్రామ రూపురేఖలు మారుతున్నాయి. అదేవిధంగా ఒక రోజంతా మాతోనే గడిపి మా బాగోగులను తెలసుకుని గ్రామ ప్రజలకు బంగారు భవిష్యత్‌ను అందించేందుకు కేసీఆర్‌ గ్రామానికి రావడం చాలా సంతోషం. చిన్నతనంలో కేసీఆర్‌కు చింతమడకలో ప్రధానోపాధ్యాయునిగా పాఠాలు బోధించాను.  గ్రామంలోని అందరి గురించి ఇప్పటికి కేసీఆర్‌ గుర్తుంచుకున్నారు. ఎదైనా విషయం ఉంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేవాడు.  రాష్ట్ర ఉద్యమం చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరిగి గ్రామానికి వçస్తుండడతో మాకు సంతోషంగా ఉంది. కేసీఆర్‌ పుట్టుక  మాఊరు ఏదో ఒక గొప్పపుణ్యం చేసుకున్నట్లుగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, గ్రామ భవిష్యత్‌ను చూస్తుంటే తెలుస్తోంది. 
–ప్రతాప్‌రెడ్డి, కేసీఆర్‌ చిన్ననాటి ప్రధానోపాధ్యాయుడు    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top