11 గురుకులాలు

Teachers Recruitment In Gurukulam School Telangana - Sakshi

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నూతన గురుకులాలు ప్రారంభం కానున్నాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పూర్తిస్థాయిలో ఉన్న 11 నియోజకవర్గాల్లో 11 గురుకులాలను జూన్‌ 1వ తేదీన ప్రారంభించనున్నారు. అయితే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కడ్తాల(రంగారెడ్డి జిల్లా)లో ఏర్పాటు చేయనున్నారు. కొడంగల్, షాద్‌నగర్‌ రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లాయి.

కొత్తవాటి ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలో గురుకులాల సంఖ్య 26కి పెరగనుంది. ఒక్కో గురుకులంలో 240 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే అవకాశం. తెలంగాణరాష్ట్ర ఏర్పాటు కాకముందు నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, చిట్యాల్‌లో మాత్రమే గురుకులాలు ఉండేవి. అయితే 2017–18 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం 12 గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇక ఈ విద్యాసంవత్సరంలో కూడా 11 గురుకులాలను ఏర్పాటు చేయడంతో మొత్తం సంఖ్య 26కు చేరనుంది. ఇది వరకు ఆయా నియోజకవర్గాల్లో బాలుర గురుకులం ఉంటే కొత్తగా బాలికలకు సంబంధించి, బాలికల గురుకులం ఉంటే బాలురులకు సంబంధించి ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి జిల్లాలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో అందే అవకాశం.

విద్యార్థులకు నాణ్యమైన విద్య.. 
విద్యాపరంగా వెనుకబడిన పాలమూరు జిల్లాలో నూతన గురుకులాల ఏర్పాటు పేద విద్యార్థులకు వరంగా మారనుంది. ఏటేటా గురుకులాల్లో ఫలితాలు చాలా మెరుగుపడడంతో వాటిలోనే విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. విద్యతో పాటు నాణ్యమైన భోజనం, పుస్తకాలు, దుస్తులు వంటి అనేకం ఉచితంగా లభించడంతో కార్పొరేట్‌ స్థాయి విద్యను ప్రభుత్వం అందించే అవకాశాలు మొండుగా ఉన్నాయి.
 
సీట్ల భర్తీ ఇలా..  
బీసీ గురుకులాల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కోసం ప్రభుత్వం బీసీ గురుకులాలకు ప్రవేశాలకు సంబంధించి గతనెల ప్రవేశ పరీక్ష నిర్వహించింది. వీటితో పాటు అన్ని గురుకులాలకు కామన్‌ ప్రవేశ పరీక్ష కూడా నిర్వహించారు. వీటిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సీట్లును కేటాయిస్తారు. బీసీ గురుకుల్లాలో మొదటి ప్రాధానత్య కింద 70శాతం సీట్లను బీసీ వర్గాలకు చెందిన వారికి కేటాయిస్తారు. మిగిలిన వాటిని వివిధ వర్గాల వారి రిజర్వేషన్‌ల ఆధారంగా కేటాయిస్తారు. ప్రస్తుతం ప్రారంభమయ్యే గురుకులాల్లో మొదటగా 5, 6, 7 తరగతులకు సంబంధించి అడ్మిషన్లు తీసుకోనున్నారు. వీటిలో ఒక్కో తరగతికి రెండు సెక్షన్ల చొప్పున విభజిస్తారు. ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులను చేరిస్తారు.

ఇలా రెండో సెక్షన్లలు కలిపి 80 మంది విద్యార్థులు, మూడు తరగతులు కలిపి మొత్తం ఒక్క గురుకులాల్లో 240 మందిని చేర్పిస్తారు. వీటితో పాటు నూతన గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది కూడా పెద్ద ఎత్తున భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గతంలో గురుకులా టీఆర్టీ ద్వారా భర్తీ చేసిన అధ్యాపకులతో పాటు, గతంలో వివిధ గురుకులాల్లో పనిచేసిన గెస్టు, ఔట్‌ సోర్సింగ్‌ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా జిల్లా లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top