ఉపాధ్యాయులకు కొత్త చిక్కు

Teachers Problems With Panchayat Elections Duty - Sakshi

పాపన్నపేట(మెదక్‌): ‘‘ఆమె పాపన్నపేట మండలంలోని మారుమూల గ్రామంలో ఒక టీచర్‌. ఈ నెల 21న మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రేగోడ్‌ మండలంలో విధులు నిర్వహించారు. ఎన్నికల తంతు ముగించుకొని ఇంటికి వెళ్లే సరికి రాత్రి ఒంటి గంట అయింది. తెల్లవారి 22న తిరిగి పాఠశాల విధులకు వెళ్లారు.’ ఇక్కడ కాస్త ఆలస్యమైనా పెద్ద ఇబ్బంది లేదు. కానీ రెండో విడత పంచాయతీ ఎన్నికల పరిస్థితి వేరు.  25న పంచాయతీ రెండో విడత ఎన్నికలు.. తెల్లవారితే పాఠశాలలో గణతంత్ర వేడుకలు. ఇక్కడ కాస్తా అటు ఇటుగా వెళ్లడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే  ప్రతి ఏడాదిలాగే గ్రామంలో నిర్ణయించిన  ఎజెండా కనుగుణంగా జెండాలు ఎగురుతుంటాయి. కాస్తా ఆలస్యమైతే అందరి విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే టీచర్లంతా టెన్షన్‌తో సతమతమవుతున్నారు.

25న జిల్లాలోని నర్సాపూర్, కౌడిపల్లి, చిలిపిచెడ్, కొల్చారం, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన టీచర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పారు. ఇందులో కొన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలుండగా, మిగతావి రెండు అంత కన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు. ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులందరికీ ఎన్నికల విధులు పడకపోయినా, ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మాత్రం 90 శాతం మందికి ఎన్నికల విధులు పడినట్లు తెలుస్తోంది. 25న జరిగే ఎన్నికల కోసం 24వ తేదీనే ఉపాధ్యాయులంతా, సంబంధిత మండలాలకు వెళ్లాల్సి ఉంటుంది. 25న ఎన్నికల విధులు ముగించుకొని తమ తమ ఇళ్లకు వచ్చే సరికి, వారి వారి దూరాన్ని బట్టి రాత్రి 1 నుంచి 2 అయ్యే అవకాశం ఉంది. తెల్లవారి ఉదయం 7 నుంచి 8 లోపు గణతంత్ర వేడుకలకు సంబంధించి జెండాలు ఎగురవేయాలి.

జాతీయ పండగ కావడంతో గ్రామాల్లో ప్రభాత్‌ భేరిలు నిర్వహిస్తూ, వరస క్రమంలో జెండాలు ఎగురవేస్తుంటారు. ఈ క్రమంలో పాఠశాల సమయానికనుగుణంగా జెండా ఎగురవేయాలి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు జరిగిన చోట కొత్త సర్పంచ్‌లు, వార్డ్‌ మెంబర్లు గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉంటారు. అందుకే టీచర్లు ఎన్నికలు విధులు ముగించుకొని సమయానికి గణతంత్ర వేడుకలకు హాజరవుతామా? లేదా? అని ఆందోళనకు లోనవుతున్నారు.

ఒకవేళ తాము పనిచేసే పాఠశాలలు మారుమూల గ్రామాలైతే..బస్సు సౌకర్యాలు లేకపోతే వారి పరిస్థితి దయనీయం. అలాగే వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించడం, స్వీట్లు పంపిణీ చేయడం, చివరకు సమావేశాలు నిర్వహించడానికి సమయం సరిపోక ఆగమవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వెళ్ళిన చోట ఎన్నికల నిర్వాహణలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడినా. సమస్యలు తలెత్తినా రాత్రి వరకు తేలని పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. కనుక ఎన్నికలకు వెళ్లిన మండలం నుంచి సకాలంలో బస్సులు వేసి గమ్యం చేర్చాలని అధికారులను కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top