తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు కార్యకర్తలను సన్నద్ధం చేయాలని
జిల్లా సమన్వయ కమిటీ నిర్ణయం
వరంగల్ : తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు కార్యకర్తలను సన్నద్ధం చేయాలని జిల్లా సమన్వయ కమి టీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశం టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన మంగళవారం రాత్రి బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయం లో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల సమస్యలపై, పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు లేనిచోట ఆయా ప్రాంతాల నాయకులతో మాట్లాడి ఇన్‌చార్జిలను నియమించాలని నిర్ణయించారు. జిల్లా అనుబంధ సంఘాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలని తీర్మానించారు.
2019లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే కార్యక్రమాలు చేపట్టాలని, నియోజకవర్గ, మండల స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈసమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ గరికపాటి మోహన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సీతక్క, ఈగ మల్లేషం, చాడా సురేష్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు బాలుచౌహన్, డాక్టర్ రామచంద్రునాయక్, రాష్ట్ర నాయకులు గట్టు ప్రసాద్‌బాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్, కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం పాల్గొన్నారు.