తెలంగాణలో చీకటి పాలన

TDF Says Telangana Govt Suppressed People Voice - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో చీకటి పాలన సాగుతోందని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అచ్యుతరామరావు అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్‌) ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళలు, రచయితలు, ప్రజా సంఘాలపై నిర్బంధాలకు వ్యతిరేకంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుత రామారావు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తూ విద్యార్థులు, ప్రజా సంఘాలను అణిచివేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బలిదానాలతో తెలంగాణ వచ్చింది తప్ప యజ్ఞాలతో కాదన్నారు.

టీపీఎఫ్‌ అధ్యక్షులు రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణలో తీవ్రమైన నిర్బంధం కొనసాగుతుందని విమర్శించారు. కశ్మీర్‌ తరహాలో ఇక్కడ అప్రకటిత నిర్బంధం కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీఎఫ్‌ కన్వీనర్‌ చిక్కుడు ప్రభాకర్, పీఓడబ్ల్యూ  నాయకురాలు సంధ్య, ప్రొఫెసర్లు లక్ష్మణ్, అన్వర్‌ఖాన్, కాసీం, అడ్వకేట్‌ రఘునాథ్, నారాయణరావు, నలమాస కృష్ణ, కోటి, దుడ్డు ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

మేధావుల గొంతులను అణచివేస్తున్నారు  
ఆందోళన వ్యక్తం చేసిన విరసం కార్యవర్గ సభ్యులు
ప్రజా సమస్యలపై ప్రశ్నించే మేధావుల గొంతులను అణచివేస్తున్నారని, దీనిలో భాగంగానే విరసం కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ కె.జగన్‌పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో విరసం కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్‌ కాశీం, తెలంగాణ సాహితీవేత్త భూపతి వెంకటేశ్వర్లు, ప్రముఖ కవి వఝల శివకుమార్, జగన్‌ తల్లి లక్ష్మీ నర్సమ్మలు మాట్లాడారు. 2009 మలిదశ తెలంగాణ ఉద్య మంలో జగన్‌  కీలకపాత్ర పోషించారని, అప్పుడు ఏర్పడిన విద్యార్ధి జేఏసీలో ప్రధాన నాయకుడిగా ఉన్నారని వారు తెలిపారు.

ప్రస్తుతం సికింద్రాబాద్‌ పీజీ కాలేజీలో అర్ధశాస్త్ర విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా జగన్‌ పనిచేస్తున్నారన్నారు. మఫ్టీలో ఉన్న గద్వాల పోలీసులు గురువారం ఉదయం 10.30 ప్రాంతంలో జగన్‌ను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అనంతరం ఆయన కళ్లకు గంతలు కట్టి ఎక్కడెక్కడో తిప్పి సాయంత్రం 4 గంటలకు ఆయన ఇంటికి తీసుకువచ్చి పుస్తకాలు, ఇల్లు మొత్తం చిందరవందర చేశారన్నారు. బేషరతుగా జగన్‌ తోపాటు చైతన్య మహిళా సంఘం నాయకురాలు శిల్ప, తెలంగాణ విద్యార్ధి వేదిక అధ్యక్షుడు మద్దిలేటి తదితరులపై పెట్టిన కేసులు ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో విరసం కార్యదర్శి పాణి, కార్యవర్గ సభ్యులు రాంకీ, రాము, క్రాంతి, సభ్యులు అరవింద్, సత్యనారాయణ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top