పన్నుల వేటలో ‘బల్దియా’

Tax Charges Warangal Municipal Corporation - Sakshi

జనగామ: పన్నుల వసూళ్లపై మున్సిపల్‌ అధికారులు దృష్టి సారించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి, వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వందశాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మొండి బకాయిలను సైతం వసూలు చేసేలా పక్కా ప్రణాళికను రూపొందించారు. కమిషనర్‌ రవీందర్‌ యాదవ్‌ నేతృత్వంలో డిమాండ్‌ నోటీసులు సిద్ధం చేసి యజమానులకు అందిస్తున్నారు.

జనగామ మునిసిపల్‌ పరిధిలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి (గృహ), కమర్షియల్, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.3.97 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. పన్నులను వంద శాతం వసూలు చేయాలని ప్రభుత్వం ఖచ్ఛితమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో అధికారులు పరుగులు పెడుతున్నారు.  పన్నులు చెల్లించే క్రమంలో బకాయిదారులను బెదిరించే కంటే బుజ్జగించడమే మేలుగా భావించిన బల్దియా అధికారుల ఆలోచన సత్ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. రూ. కోట్లలో పేరుకుపోతున్న బకాయిలతో అభివృద్ధి సాధ్యం కాదని తేల్చుకున్న పురపాలక శాఖ అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

రూ.3.97 కోట్లు
పట్టణ పరిధిలో 11,388వేల గృహ, కమర్షియల్‌ భవనాలు ఉన్నాయి. ఇందులో 9,151 నివాస గృహాలు, 879 దుకాణాలు, 81 ప్రభుత్వ కార్యాలయాలు, 1,277 నివాస గృహాలతో కలిపి ఉన్న వ్యాపార సంస్థలు ఉన్నాయి. వీటిపై రూ.3.97,25 కోట్ల పన్నులు రావాల్సి ఉంది. ఆరు వేల నివాస గృహాలతో పాటు వ్యాపార సంస్థలకు డిమాండ్‌ నోటీసులు అందించారు. ‘పన్నులు చెల్లించండి.. పట్టణాభివృద్ధికి సహకరించండి’ అంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.30 లక్షలకు పైగా పన్నులు వసూలు చేశారు.

పేరుకుపోయిన ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు
ఆస్తి పన్ను విషయంలో గృహ వినియోగ దారులతో కాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి వేరుగా వసూలు చేస్తుంది. ప్రభుత్వ శాఖల నుంచి రూ.10.49 లక్షలకు పైగా పన్నులు రావాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పన్నులను ముక్కు పిండి వసూలు చేసేందుకు అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.

పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించండి
పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి.అధికారులు ఇంటింటికీ తిరుగుతూ పన్నులు వసూలు చేయడంలో అంకితభావంతో పనిచేయాలి. వందశాతం టార్కెట్‌ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలి.   ఆస్తి, ఇతర పన్నులను సకాలంలో చెల్లించి ప్రతి ఒక్కరూ అభివృద్ధికి తమతో పాటు కలిసి రావాలి. ప్రభుత్వ శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పన్నులను చెల్లించాలి. – నాగారపు వెంకట్, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top