ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పెడతాం

Talasani Srinivas Yadav Meeting With Chiranjeevi And Nagarjuna In Annapurna Studios - Sakshi

మంత్రి తలసాని హామీ  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు శంషాబాద్‌లో అవసరమైన స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో సీనియర్‌ సినీనటులు చిరంజీవి, నాగార్జునలతో మంత్రి సమావేశమయ్యారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, కళాకారుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణం కోసం అన్ని విధాలుగా అందుబాటులో ఉండేలా స్థలం కేటాయించాలని చిరంజీవి, నాగార్జున మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రాజేంద్రనగర్‌ ఆర్‌డీవో చంద్రకళను అవసరమైన స్థలాన్ని వెంటనే సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సినీ, టీవీ కళాకారుల ఇళ్ల నిర్మాణం కోసం చిత్రపురి కాలనీ తరహాలో పరిసర ప్రాంతాల్లో మరో 10 ఎకరాల స్థలం కేటాయించాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, 24 విభాగాల సినీ కళాకారులకు సాంకేతిక నైపుణ్యం పెంపుకోసం అవసరమైన శిక్షణా కేంద్రం నిర్మాణానికి జూబ్లీహిల్స్, నానక్‌రాం గూడ ప్రాంతాలలో స్థలాలు కేటాయించా లని సినీనటులు ప్రతిపాదిం చారు. రూ.కోట్లతో సినిమాలు నిర్మిస్తే పైరసీతో నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వస్తుందని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని కోరారు. పైరసీని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీనిచ్చారు. సినిమా షూటింగుల అనుమతుల కోసం వివిధ శాఖల నుంచి అనుమతులు పొందేందుకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకురాగా, సింగిల్‌ విండో విధానంలో ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో షూటింగ్‌ అనుమతులిచ్చేలా వివిధ శాఖల సమన్వయంతో ఇప్పటికే తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి చెప్పారు.

ఆరోగ్య బీమా అమలు చేయండి..
చలనచిత్ర రంగంలో పనిచేస్తున్న సుమారు 28 వేల మంది కళాకారులకు ఎఫ్‌డీసీ ద్వారా గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని, కేన్సర్‌ వంటి వ్యాధుల చికిత్సకు అవసరమైన ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని సినీనటులు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడేవారు ఎవరైనా ఉంటే వారి వివరాలు ఇస్తే సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటామని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ రాంమోహన్‌రావు, నిర్మాత నిరంజన్, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్‌బాబు, హోంశాఖ డిప్యూటీ సెక్రెటరీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top