పరిపూర్ణానంద: ఎప్పుడో చేసిన ప్రసంగాలపై ఇప్పుడు బహిష్కరణా? | Swamy paripoornananda Files Petition in High Court | Sakshi
Sakshi News home page

Jul 23 2018 3:29 PM | Updated on Aug 31 2018 8:42 PM

Swamy paripoornananda Files Petition in High Court - Sakshi

గూండాలను మాత్రమే నగరం నుంచి పోలీసులు బహిష్కరిస్తారు!

సాక్షి, హైదరాబాద్‌ : శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద దాఖలు చేసిన పిటిషన్‌పై  సోమవారం హైకోర్టులోవాదనలు కొనసాగాయి. తనను నగరం నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ.. హైదరాబాద్‌ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ప్రతివాదిగా చేర్చారు.

ఆదిలాబాద్‌లో, కరీంనగర్‌లో గతంలో పరిపూర్ణానంద ఇచ్చిన ప్రసంగాల ఆధారంగా ఆయనను బహిష్కరించమని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలుపగా.. హైదరాబాద్ పరిధిలో ఎలాంటి కేసులు లేకుండా ఎలా బహిష్కరిస్తారని పరిపూర్ణానంద తరఫున వాదనలు వినిపిస్తున్న మాజీ అడ్వొకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. ఎప్పుడో చేసిన ప్రసంగాలపై ఇప్పుడు ఎలా బహిష్కరిస్తారని అడిగారు. ధర్మాగ్రహ యాత్రకు మొదటి అనుమతి ఇచ్చి తర్వాత ఎందుకు అనుమతి నిరాకరించారో తెలపాలని కోరారు. ఆర్టికల్ 19 ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉంటుందని ఆయన కోర్టుకు తెలిపారు. స్వామి పరిపూర్ణానందపై వేసిన నగర బహిష్కరణ ఎత్తివేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. పరిపూర్ణానంద బహిష్కరణకు సంబంధించి.. ఒరిజినల్‌ డాక్యుమెంట్లను మంగళవారం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఓ టీవీ చానెల్‌లో చర్చ సందర్భంగా శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు. తనపై విధించిన నగర బహిష్కరణపై న్యాయపోరాటం చేయాలని స్వామి పరిపూర్ణానంద నిర్ణయించారు. ఇందులో భాగంగానే హైకోర్టులో ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. తన బహిష్కరణ రాజ్యాంగ విరుద్ధమని, గూండాలను మాత్రమే నగరం నుంచి పోలీసులు బహిష్కరిస్తారని పరిపూర్ణానంద పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement