‘స్వచ్ఛ గజ్వేల్’కు శ్రీకారం | Swachh gajwel programe | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ గజ్వేల్’కు శ్రీకారం

May 23 2015 11:33 PM | Updated on Aug 14 2018 10:51 AM

‘స్వచ్ఛ హైదరాబాద్’ స్ఫూర్తిగా ‘స్వచ్ఛ గజ్వేల్’ కార్యక్రమాన్ని శనివారం స్థానిక నగర పంచాయతీలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు.

వారం రోజులపాటుకార్యక్రమాలు
అధికారులకు వార్డుల వారీగా బాధ్యతలు
{పారంభించిన  ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

 
 గజ్వేల్ : ‘స్వచ్ఛ హైదరాబాద్’ స్ఫూర్తిగా ‘స్వచ్ఛ గజ్వేల్’ కార్యక్రమాన్ని శనివారం స్థానిక నగర పంచాయతీలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో పరిశుభ్రత ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఇందిరా పార్క్ చౌరస్తా వరకు సాగింది. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ‘స్వచ్ఛ గజ్వేల్’కు సంబంధించి నియమితులైన అధికారులు తమ తమ వార్డుల్లో చెత్తను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ పలు వార్డులను సందర్శించారు. అనంతరం కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... పారిశుద్ధ్య పనులు ఉద్యమ స్థాయిలో సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోనే గజ్వేల్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రధానంగా పారిశుద్ధ్య లోపాన్ని సంపూర్ణంగా నిర్మూలించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ఇందుకోసం వారం రోజులపాటు ‘స్వచ్ఛ గజ్వేల్’ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగనుందని చెప్పారు.

పట్టణంలో ప్రస్తుతం మటన్ మార్కెట్ల వద్ద వాతావరణం మెరుగు పడాల్సి ఉందన్నారు. నగర పంచాయతీ కార్యాలయ వెనుక భాగం నుంచి జాలిగామ బైపాస్ రోడ్డును కలుపుతూ కొత్తగా ఫార్మేషన్ రోడ్డు నిర్మిస్తామన్నారు. మూడు చోట్ల డంపింగ్ యార్డుల ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రోడ్ల చెత్త చెదారం పడేయకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పట్టణంలోని 500 ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే దిశలో భూగర్భ డ్రైనేజీ విధానాన్ని తీసుకురావాలని కేసీఆర్ యోచిస్తున్నారని తెలిపారు. గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలకనుగుణంగా గజ్వేల్ నగర పంచాయతీని తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు.  కార్యక్రమంలో ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు, నగర పంచాయతీ కమిషనర్ ఎన్.శంకర్, టీఆర్‌ఎస్ గజ్వేల్ మండల అధ్యక్షులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు ఆకుల దేవేందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement