జస్టిస్‌ సురేశ్‌ కెయిత్‌ బదిలీకి సుప్రీంకోర్టు సిఫారసు

Supreme Court recommends transfer of Justice Suresh Keith - Sakshi

     తిరిగి ఢిల్లీకి బదిలీ చేయాలని కోరిన జస్టిస్‌ కెయిత్‌

     సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు కొలీజియం

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కెయిత్‌ బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి రెండు రోజుల క్రితం సిఫారసు చేసింది. ఢిల్లీ హైకోర్టు నుంచి ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చిన జస్టిస్‌ కెయిత్‌ తనను తిరిగి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ ఈ ఏడాది జూలై 9న సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. తాను ఎందుకు ఢిల్లీకి బదిలీ కోరుతున్నానో కారణాలు కూడా వివరించారు. రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు కొలీజియం సమావేశం జరగ్గా, అందులో జస్టిస్‌ కెయిత్‌ బదిలీ అంశం చర్చకు వచ్చింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్, జస్టిస్‌ ఎ.కె.సిక్రీలతో కూడిన కొలీజియం జస్టిస్‌ కెయిత్‌ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది. ఆయన కోరుకున్న విధంగా తిరిగి ఆయనను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కేంద్రానికి సిఫారసు చేస్తూ తీర్మానం చేసింది. కొలీజియం సిఫారసును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపుతుంది. అనంతరం బదిలీ ఉత్తర్వులపై రాష్ట్రపతి సంతకం చేస్తారు. 2008లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్‌ కెయిత్‌ నియమితులయ్యారు. 2013లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై, 2016లో ఉమ్మడి హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో 6వ స్థానంలో కొనసాగుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top