పత్తికి మద్దతు ధర కరువు

Support price drought cotton - Sakshi

మొదటిరోజు క్వింటాలుకు రూ.4వేలే

ఆదిలాబాద్‌ మార్కెట్‌లో ప్రారంభమైన కొనుగోళ్లు

సాక్షి, ఆదిలాబాద్‌: పత్తికి గిట్టుబాటు ధర మాటేమో కానీ.. కనీస మద్దతు ధర కూడా కరువైంది. ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో సోమవారం పత్తి కొనుగోళ్లు ప్రారం భించారు. ప్రభుత్వం పత్తి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.4,320 ప్రకటించగా, మొదటి రోజు క్వింటాలుకు రూ. 4 వేలు మాత్రమే రైతుకు దక్కింది. పత్తి తేమ విషయంలో వ్యాపారులు, రైతుల మధ్య వివాదం తలెత్తడంతో చర్చల అనంతరం తేమతో సంబంధం లేకుండా క్వింటాలుకు రూ.4 వేల చొప్పున కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, రైతులకు మధ్య ఒప్పందం కుదిరింది. భారత పత్తి సంస్థ(సీసీఐ) మార్కెట్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ ప్రేక్షక పాత్ర వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

రూ.43 కోత..
ఆదిలాబాద్‌లో సోమవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ముందుగానే ప్రకటించడంతో చుట్టుపక్కల గ్రామాలు, మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున పత్తిని తీసుకొచ్చారు. ఉదయం 9.30 గంటలకు మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్‌ ఎంపీ గొడం నగేశ్, కలెక్టర్‌ ఎం.జ్యోతిబుద్ధ ప్రకాశ్‌ సమక్షంలో పత్తి ధర నిర్ణయం కోసం వేలం పాట నిర్వహించారు. ఎనిమిది శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాలుకు రూ.4,320 నుంచి వేలం పాట ప్రారంభం కాగా, వ్యాపారులు ధర పెంపులో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రూ.4,500 కంటే ఎక్కువ ధర ఇవ్వలేమని స్పష్టం చేశారు. తర్వాత మార్కెట్‌కు వచ్చిన పత్తిలో తేమ పరిశీలించగా, 20 నుంచి 25 శాతం వరకు ఉంది.

వేలం పాటలో పలికిన ధరను 8 శాతం తేమ ఉంటేనే ఇస్తామని, అంతకుమించి ఉంటే ప్రతి అదనపు శాతానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.43 చొప్పున కోత విధిస్తామని వ్యాపారులు చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి జోగు రామన్న చొరవ తీసుకొని వ్యాపారులతో పలు దఫాలుగా రైతుల సమక్షంలో చర్చించగా, మొదటి రోజు తేమతో సంబంధం లేకుండా క్వింటాలుకు రూ.4 వేలు చెల్లించేందుకు వారు అంగీకరించడంతో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే, మంగళవారం నుంచి పత్తిలో 8 శాతం తేమ మించితే ప్రతి అదనపు శాతానికి రూ.43 చొప్పున కోత ఉంటుందని, రైతులు పత్తిని ఆరబెట్టుకొని తీసుకురావాలని ట్రేడర్లు, అధికారులు సూచిస్తున్నారు.

మొదటి రోజే భారీగా రాక.. 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ యేడాది సుమారు 3.27 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగైంది. 60 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్‌లో సోమవారం కొనుగోళ్లు ప్రారంభం కాగా, రెండు మూడు రోజుల్లో మిగతా కేంద్రాల్లోనూ ప్రారంభించనున్నారు. కాగా, తొలిరోజే సుమారు 15వేల క్వింటాళ్ల పత్తి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.  మద్దతు ధరపై ఆశలు పెట్టుకున్న రైతులకు ప్రారంభం రోజే ఈ పరిస్థితి ఎదురుకావడంతో దిగాలు చెందుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top