ఆవకాయ.. టేస్టే వేరు..

Summer Special mango Pickle Special Story - Sakshi

ఆవకాయ పచ్చడిలేని ఇల్లు జంటనగరాల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. వేసవి వచ్చిందంటే మామిడి సీజన్‌ మొదలవుతుంది. తెలుగు లోగిళ్లలో ఆవకాయ పచ్చడికి ఉన్న ప్రత్యేకతే వేరు. నగరంలో ఊరగాయల వాడకం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌ లో వీడియోలు చూసి చాలామంది ఇళ్లలోనే పచ్చడి చేసుకుంటున్నారు. దానికితోడు కరోనా కారణంగా పచ్చళ్ల కోసం మార్కెట్లను ఆశ్రయించకుండా ఇంట్లో తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. పచ్చడి ప్రియులు ఎంతగానో ఎదురుచూసే పచ్చడి మామిడి కాయలు మార్కెట్లోకి వచ్చేశాయి. గతంలో కంటే కాస్త ధర ఎక్కువగా ఉన్నా వాటికి ఏ మాత్రం డిమాండ్‌ తగ్గలేదు. మహిళలు మార్కెట్‌కు వచ్చి వాటిని కొనుగోలు చేసి వారి వద్దే ముక్కలు చేయించుకొని తీసుకెళ్తున్నారు.  

దిల్‌సుఖ్‌నగర్‌: మలక్‌పేట్, మహేశ్వరం జోన్‌ పరిధిలోని ఇళ్లలో మామిడికాయ పచ్చడి పెట్టడంలో అందరూ బిజీగా ఉన్నారు.  పెళ్లిళ్లు, పేరంటాలు.. ఇంట్లో ఏ కార్యం జరిగినా అక్కడ ఆవకాయ ఉండాల్సిందే.. పప్పులో ఉప్పు తగ్గినా.. కూరలో కారం తగ్గినా.. ఆవకాయ తోడైతే భోజనం సంపూర్ణంగా ముగిసినట్లే.. లాక్‌డౌన్‌ కారణంగా బయటకు వెళ్లడం చాలా వరకు తగ్గించారు. కూరగాయల కోసం నిత్యం మార్కెట్లకు వెళ్లకుండా వారానికి సరిపడా తెచ్చుకుంటున్నారు. దాంతో కొన్ని సమయాల్లో ఆవకాయ పచ్చడితోనే భోజనం లాగించేస్తున్నారు. 

మామిడి పచ్చళ్లలో రకాలెన్నో...
మామిడి పచ్చడిలో రకాలు అనేకం.. కానీ ఎక్కువగా ఇష్టపడేవి ఆవకాయ, అల్లం పచ్చడి మాత్రమే.. వేసవిలో వచ్చే పుల్లటి మామిడితో తయారు చేయించుకొని ఏడాదంతా నిల్వ ఉంచుకుంటారు. పేద, మధ్యతరగతి వారి ఇళ్లలోనే ఎక్కువగా మామిడి పచ్చడి ఉంటుందనేది ఒకప్పటి మాట.. సంపన్నులు సైతం మామిడి పచ్చడికే జైకొడుతున్నారు. 

పెరిగిన మామిడికాయ ధరలు..
గతేడాది మామిడి దిగుబడి అంతగా లేదు. అయినా వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న కాయలతో పచ్చళ్లను తయారు చేసుకున్నారు. గతేడాది ఒక్కో కాయ ధర రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయించారు. ఈ సంవత్సరం మామిడి దిగుబడి బాగానే ఉంది. పచ్చడి ప్రియులకు కావాల్సిన రకం కాయలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రైతులు, వ్యాపారులకు గిట్టుబాటు అయ్యింది. మార్కెట్‌లో మంచి రకం కాయ ఒక్కటి రూ.20 నుంచి రూ.25 వరకు ధర పలుకుతోంది. సీజన్‌ ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో కొనుగోళ్లు కూడా పెరిగాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top