సింగరేణి చూపు.. సోలార్‌ వైపు | Singareni Focus On Solar power generation | Sakshi
Sakshi News home page

సింగరేణి చూపు.. సోలార్‌ వైపు

Jun 29 2019 3:10 AM | Updated on Jun 29 2019 3:10 AM

Singareni Focus On Solar power generation - Sakshi

సాక్షి, కొత్తగూడెం: బొగ్గు వెలికితీతలో 129 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ తాజాగా సోలార్‌ విద్యుదుత్పత్తికి రంగంలోకి దిగింది. ఇప్పటికే సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును మంచిర్యాల జిల్లా జైపూర్‌లో నిర్మించి 2016 నుంచి 1,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం సోలార్‌ విద్యుదుత్పత్తి విషయంలోనూ వడివడిగా అడుగులు వేస్తోంది. వచ్చే అక్టోబర్‌ 1వ తేదీ నాటికి మొదటి విడతలో 129 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

మొదటి దశలో 129 మెగావాట్లు 
మొదటి దశలో 129 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి లక్ష్యం తో ముందుకు వెళుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం–3 సింగరేణి ఏరియాలో 50 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్, భద్రాద్రి జిల్లా మణుగూరు ఏరియాలో 30 మెగావాట్ల ప్లాంట్, ఇల్లెందు ఏరియాలో 39 మెగావాట్ల ప్లాంట్, మంచిర్యాల జిల్లాలోని జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు వద్ద 10 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఏరియాల్లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 1 నాటికి మొదటిదశలో ఈ 4 చోట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండో దశలో 90 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి ప్లాంట్లు నిర్మించనున్నారు.

మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలో 43 మెగావాట్లు, జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి ఏరియాలో 10 మెగావాట్లు, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఏరియాలో 37 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లు నిర్మిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగా ప్రతిపాదించిన మూడోవిడత కింద 81 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి రెండు దశలకు భిన్నంగా మూడో విడతలో సోలార్‌ ఫలకాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి 2 విడతల్లో సింగరేణి ఖాళీ స్థలాల్లో సోలార్‌ ప్లాంట్లు నిర్మిస్తుండగా, మూడో విడతలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన చోట్ల సోలార్‌ విద్యుదుత్పత్తికి ప్రణాళికలు తయారు చేశారు. మూసేసిన గనులు, ఉపరితల గనుల డంప్‌లపైన అవకాశాలను బట్టి సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మిడ్‌మానేరు డ్యాం, దిగువ మానేరు డ్యాం, ఎల్లంపల్లి బ్యారేజ్, మంచిర్యాల జిల్లాలోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు ‘రా’వాటర్‌ జలాశయంపైన సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సింగరేణి జిల్లాల్లోని సింగరేణి భవనాలపై సోలార్‌ సిస్టమ్‌ అమర్చాలని నిర్ణయించారు. 

రూ.1,361.5 కోట్లు కేటాయింపు
సోలార్‌ విద్యుదుత్పత్తి రంగంలోకి దిగాలనుకున్న వెంటనే సింగరేణి యాజమాన్యం ఇందుకోసం రూ.1,361.5 కోట్లు కేటాయించింది. సింగరేణి విస్తరించి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సింగరేణి ఏరియాల్లో మూడు విడతల్లో సోలార్‌ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయించింది. ఆయా ఏరియాల్లో అందుబాటులో ఉన్న 1,535 ఎకరాల్లో సోలార్‌ ప్లాంట్లు నిర్మించి 300 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే లక్ష్యంతో ముందుకెళుతోంది. మొత్తం మూడు విడతల్లో ఈ ప్లాంట్ల నిర్మాణానికి బీహెచ్‌ఈఎల్‌తో సింగరేణి యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. సోలార్‌ ప్లాంట్లు నిర్మించడంతో పాటు, ఆయా ప్లాంట్లను పదేళ్ల పాటు బీహెచ్‌ఈఎల్‌ సంస్థే నిర్వహిం చాలని కూడా ఒప్పందం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement