స్పెషల్‌ అట్రాక్షన్‌ సింగపూర్‌ పులి!

Singapore Tiger In NightSafari Park Kothwal Guda hyderabad - Sakshi

కొత్వాల్‌గూడలో నైట్‌ సఫారీ పార్కు  

50 హెక్టార్లలో ఏర్పాటు చేయనున్న హెచ్‌ఎండీఏ

తొమ్మిది రకాల అడవులు,140 జాతుల జంతువులు

కొన్ని జంతువులు విదేశాల నుంచి రాక

మరో రెండు నెలల్లో డిజైన్లు సిద్ధం

పర్యాటకులకు గిరిజన సంప్రదాయ స్వాగతం

సాక్షి, సిటీబ్యూరో: దేశంలో తొలిసారి కొత్వాల్‌ గూడలో ఏర్పాటు చేసే నైట్‌ సఫారీ పార్కులో విదేశీ జంతువులను ఉంచనున్నారు. వీటిలో సింగపూర్‌ పులి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సింగపూర్‌కు వెళ్లి నైట్‌ సఫారీలో విహరించిన అనుభూతినే ఇక్కడా పొందేలా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆ దేశంలో కేవలం 40 హెక్టార్లలో నైట్‌ సఫారీ వినియోగంలో ఉంది. దానికంటే పెద్దగా 50 హెక్టార్లలో దాదాపు తొమ్మిది రకాల ఆడవులను ఏర్పాటు చేసి సుమారు 140 జాతులకు చెందిన జంతువులను ఉంచాలని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేసే ఈ పార్కు ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షించేలా రూపొందించనున్నారు. హెచ్‌ఎండీఏతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బెర్నార్డ్‌ హారిసన్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు మరో రెండు నెలల్లో పూర్తి డిజైన్లను సమర్పించనున్నారు. ఇటీవల కొత్వాల్‌గూడలోని స్థలాన్ని పరిశీలించిన ప్రతినిధులు మంత్రముగ్ధులయ్యారు. సహజంగానే చెట్లు పెరిగి అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతంలో నైట్‌ సఫారీ పార్కులో ట్రెక్కింగ్‌ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో నొయిడాలో  నైట్‌ సఫారీ పార్కును ఏర్పాటు చేయాలనుకున్నా నిధుల లేమితో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. 

వాహనాల వెలుగులో పర్యటన
సింగపూర్‌ నైట్‌ సఫారీ పార్కులో ఉన్నట్టుగానే ట్రామ్‌ లేదా టాయ్‌ ట్రైన్‌లో సందర్శకులు రాత్రివేళ అడవిలో తిరిగే ఏర్పాటు చేయనున్నారు. దాదాపు గంటపాటు జంతువులను చూసే వీలుకల్పిస్తారు. చిమ్మచీకటిలో కలియ తిరుగుతూ వన్యప్రాణుల కదలికలను దగ్గరి నుంచి చూసే అవకాశం కలిగించనున్నారు. మధ్యమధ్యలో ఏర్పాటు చేసిన ప్రత్యేక లైట్ల వెలుగులో జంతువులను చూడవచ్చు. జంతువులకు ఇబ్బంది కలగకుండా ఈ లైట్‌ చాలా డిమ్‌గా ఉంచనున్నారు. ఈ కృత్రిమ ఆడవిలో దాదాపు 140 జాతులకు చెందిన జంతుజాలాన్ని ఉంచాలని అధికారులు నిర్ణయించారు. విదేశీ జంతువులతో పాటు స్థానికంగా ఉండే నక్కలు, జీబ్రాలు, జింకలు, కోతులు, కొండెంగలు, సింహాలు, కుందేళ్లు.. ఇలా వివిధ రకాల జంతువులను తీసుకురానున్నారు. వీటిపై మరో రెండు నెలల్లో స్పష్టత రానుంది. అలాగే మధ్యమధ్యలో నీళ్లు జాలువారేలా ఏర్పాట్లు, అక్కడక్కడా కుంటల్లో మొసళ్లు కూడా కనిపిస్తాయి. 

గిరిజన ప్రదర్శనలతో స్వాగతం..
సింగపూర్‌ నైట్‌ సఫారీ పార్కు ముందు గిరిజనుల ప్రదర్శనలు ఉన్నట్టుగానే ఇక్కడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు బస చేసేందుకు ప్రత్యేక కాటేజీలు కూడా తీర్చిదిద్దనున్నారు. కుటుంబంతో కలిసి వచ్చే సందర్శకులు రుచికరమైన ఆహరాన్ని అస్వాదించేందుకు రెస్టారెంట్లు కూడా ఉంటాయంటున్నారు. రాత్రి సమయాల్లో నైట్‌ సఫారీ చూసేందుకు వచ్చేవారికి సకల సౌకర్యాలు ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top