నీళ్లు నిండాయి!

Significantly Increased Groundwater Levels In Telangana - Sakshi

గణనీయంగా పెరిగిన భూగర్భ నీటిమట్టాలు

సాక్షి, హైదరాబాద్‌: గడిచిన రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భూగర్భ నీటిమట్టాలు పెరిగాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందున్న పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం భూగర్భ నీటిమట్టాలు గణనీయంగా మెరుగయ్యాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారడం, చిన్ననీటి వనరుల్లో సమృధ్ధిగా నీటి లభ్యత ఉండటం పాతాళగంగ పైకి వచ్చేందుకు దోహదపడింది. జూన్‌ మొదటి వారంలో 15 మీటర్ల దిగువకు పడిపోయిన నీటిమట్టం... ప్రస్తుతం 9.75 మీటర్లకు చేరింది. ఇక రాష్ట్రంలోనూ ప్రస్తుతం పంటలన్నీ పొట్ట దశలో ఉండటం, వాటికి భూగర్భ వినియోగం అవసరం లేకపోవడం, ఇంకా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భూగర్భ నీటిమట్టాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. 

గణనీయ వృధ్ధి..
గత నెలలో రాష్ట్ర సగటు వర్షపాతం 726 మిల్లీమీటర్లకుగాను 795 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఏకంగా 9 జిల్లాల్లో (హైదరాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నారాయణపేట, సిరిసిల్ల, సిధ్దిపేట, నిజామాబాద్, వరంగల్‌ అర్బన్‌) ఏకంగా 21 శాతం నుంచి 36 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఈ ఏడాది జూన్‌లో రాష్ట్ర సగటు నీటిమట్టం 15 మీటర్లు ఉండగా ఆగస్టులో అది 11.15 మీటర్లుకు చేరింది. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో అది 9.85 మీటర్లకు చేరింది. అంటే జూన్‌తో పోలిస్తే 5.15 మీటర్లు, ఆగస్టుతో పోలిస్తే 1.30 మీటర్ల మేర భూగర్భమట్టం మెరుగైంది.

రాష్ట్ర భూభాగంలో 30 శాతం 5 మీటర్లకన్నా తక్కువ మట్టంలోనే భూగర్భ నీటిలభ్యత ఉండగా 28.7 శాతం భూగర్భ విస్తీర్ణంలో 5 నుంచి 10 మీటర్ల మధ్యన నీటిమట్టాలు రికార్డయ్యాయి. దీనికితోడు గడిచిన నెలంతా కురిసిన వర్షాలతో చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. రాష్ట్రంలో ఉన్న 40 వేలకుపైగా చెరువులకుగాను ఏకంగా 14 వేల మేర చెరువులు నిండుకుండలుగా కనబడుతున్నాయి. ఒక్క గోదావరి బేసిన్‌లోనే 10,500 చెరువులు పూర్తిస్థాయిలో నిండగా కృష్ణా బేసిన్‌లో 3,300 చెరువులు జలకళతో కలకళ్లాడుతున్నాయి.

గతేడాదితో పోలిస్తే 10 వేల చెరువులు నిండుగా ఉండటం, మరో 10 వేల చెరువుల్లోనూ సగానికిపైగా నీరు చేరడం భూగర్భ నీటిమట్టాల్లో పెరుగుదలకు దోహదపడింది. రాష్ట్రంలో ఒక్క మెదక్‌ జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లోనూ 20 మీటర్ల పరిధిలో భూగర్భ నీటిమట్టాలు లభ్యతగా ఉన్నాయి. గతేడాది మెదక్‌ సహా సిధ్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లల్లోనూ 20 మీటర్లకు దిగువనే భూగర్భ మట్టాలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top