యజమాని సంతకం తప్పనిసరి! | signature of family head made compulsory for family survey | Sakshi
Sakshi News home page

యజమాని సంతకం తప్పనిసరి!

Aug 10 2014 1:13 AM | Updated on Oct 3 2018 7:02 PM

యజమాని సంతకం తప్పనిసరి! - Sakshi

యజమాని సంతకం తప్పనిసరి!

ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న సమగ్ర సకుటుంబ సర్వే ఫార్మాట్ ను రాష్ర్ట ప్రభుత్వం శనివారం ఖరారు చేసింది.

సకుటుంబ సర్వేలోని ముఖ్యాంశాల ఖరారు
ఫార్మాట్‌ను విడుదల చేసిన ప్రభుత్వం
ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్స్, గ్యాస్ బుక్, విద్యా సర్టిఫికెట్లు చూపాలి
ఒక కుటుంబానికి ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు, భూములున్నాయో చెప్పాలి
ఒకే ఇంట్లో అన్నదమ్ములు వేరుగా ఉంటే వేర్వేరుగా సర్వే ఫారాలు నింపాలి

సాక్షి, హైదరాబాద్: ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న సమగ్ర సకుటుంబ సర్వే ఫార్మాట్ ను రాష్ర్ట ప్రభుత్వం శనివారం ఖరారు చేసింది. జిల్లాల్లో కూడా వీటికనుగుణంగా ఎన్యూమరేట్ చేస్తారు. అయితే ఈ ఫారంలో స్థానికతకు సంబంధించి అంశాలను పేర్కొనలేదు. సర్వే బుక్‌లెట్‌లో పొందుపరిచిన ముఖ్యాంశాలు..
సర్వే ఫారంపై కుటుంబ యజమాని సంతకం తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇంటికి తాళం వేసి ఉంటే పక్కింటివారిని అడిగి ఇంటి యాజమాని పేరు మాత్రమే నమోదుచేసి, మిగతా వివరాలు వదిలివేయాలి.
సర్వే చేసే వారు ప్రజలు చెప్పిన వివరాలను మాత్రమే నమోదు చేసుకోకుండా ఆయా అంశాలను చర్చించి ఆ సమాచారాన్ని రాయాలి. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పోస్టాఫీస్ పాస్‌బుక్, గ్యాస్ కనెక్షన్ బుక్, విద్యా సర్టిఫికెట్లు, వికలాంగుల సర్టిఫికెట్లు, భూమి పట్టాల వివరాలు తీసుకుని సర్వే పత్రాలు నింపాలి.
సంచార జాతుల వివరాలను సేకరించి వారి సొంత మండలాల తహసీల్దార్లకు ఈ సమాచారాన్ని పంపించాలి.
గ్రామాల్లో సర్వే చేస్తున్నపుడు ఈ పట్టికలో ప్రస్తుతం గ్రామాల్లో నివసిస్తున్న వారి వివరాలు మాత్రమే తీసుకోవాలి. పట్టణంలో సర్వే చేస్తున్నపుడు పట్టికలో ప్రస్తుతం పట్టణంలో నివసిస్తున్న వారి వివరాలను రాయాలి. విద్యార్థులు చదువు కోసం వేరే ప్రదేశాల్లో నివసిస్తుంటే వారి వివరాలు కూడా రాయాలి. ఒకవేళ వారి కొడుకుల కుటుంబాలు ఉద్యోగరీత్యా పట్టణాల్లో నివసిస్తుంటే వారి వివరాలు రాయకూడదు.
కుటుంబం  మొత్తం సొంత స్థిరాస్తుల వివరాలు రాయాలి. వారికి ఏయే ఆస్తులున్నాయో, ఎన్ని ఉన్నాయో, అడిగి వాటి మొత్తం సంఖ్యను, వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు రాయాలి. ఒకే రకమైన చరాస్తులు రెండు ఉన్నాయంటే.. కేవలం ఒకదాని రిజిస్ట్రేషన్ నంబరే మాత్రమే రాయాలి.
కుటుంబ సభ్యులు చేసే పనిని రాయాలి. ఒకవేళ రెండు వృత్తులు చేస్తే.. అందులో ఏ వృత్తి ద్వారా  వారు ఎక్కువ ఆదాయాన్ని పొందుతారో దాని కోడ్ రాయాలి. రెండు వృత్తుల కోడ్‌లు రాయకూడదు.
కుటుంబానికి భూమి ఉన్నట్లయితే ఈ విభాగంలోని వివరాలు రాయాలి. కుటుంబానికి అన్నిచోట్ల ఉన్న భూమి వివరాలతో సహా రాయాలి. కుటుంబంలో ఎవరెవరి పేరు మీద (వారు ఆ గ్రామంలో లేకున్నా) భూమి ఉందో వారందరి వివరాలు రాయాలి.
 
కుటుంబం నిర్వచనమిదీ..
సాధారణంగా కొందరు వ్యక్తుల సమూహం ఒకే కప్పు కింద ఉంటూ, ఒకే వంటగది నుంచి భోజనాలు సమకూర్చుకుంటుంటే, దాన్ని ఒక కుటుంబంగా పరిగణిస్తారు. ఒకవేళ ఇంట్లో తల్లిదండ్రులతోపాటు ఒకటికంటే  ఎక్కువ పెళ్లైన జంటలుంటే, ఒక పొయ్యితోనే (అంటే ఒకే కుటుంబంగా కలిసి) నివసిస్తుంటే ఒక కుటుంబంగా భావించి ఒక ఫారంలోనే పూర్తి వివరాలు రాయాలి. మామూలుగా ఒక ఇంట్లో ఒక కుటుంబమే నివసిస్తుంది. కానీ, కొన్ని ఇళ్లలో మాత్రం అన్నదమ్ములు ఒకటి కంటె ఎక్కువ కుటుంబాలు వేర్వేరుగా ఉంటూ, వేర్వేరుగా వంట చేసుకుంటున్న పక్షంలో అక్కడ ఎన్ని కుటుంబాలు వేరుగా నివసిస్తే.. అన్ని సర్వే ఫారాలు నింపాలి.
 
19న ‘సర్వే’ జన సెలవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 19న ఇంటింటా సర్వే నిర్వహించాలని తలపెట్టిన నేపథ్యంలో ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. సర్వేకు సామాన్య ప్రజలందరూ అందుబాటులో ఉండేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించనుంది. సెలవు అమలు చేయని సంస్థలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సర్వే విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సెలవు వర్తించదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement