ప్రభుత్వ వైద్యులపై సర్కారు కొరడా  | Showcase Notices to 134 specialist doctors | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యులపై సర్కారు కొరడా 

Jun 24 2019 1:50 AM | Updated on Jun 24 2019 5:29 AM

Showcase Notices to 134 specialist doctors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లో పనిచేసే ప్రభుత్వ వైద్యులకు షోకాజ్‌ నోటీసులు జారీ కావడం సంచలనం రేపుతోంది. ఏకంగా 134 మంది ప్రభుత్వ వైద్యులకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం ఇటీవల కాలంలో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెబుతున్నారు. చెప్పాపెట్టకుండా విధులకు హాజరు కాకపోవడం వల్లే ఈ నోటీసులు జారీ చేసినట్లు షోకాజ్‌ నోటీసుల్లో వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ మాణిక్‌రాజ్‌ ప్రస్తావించారు. నోటీసులు అందుకున్న వారిలో జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జన్, గైనకాలజీ, ఆర్థో, పీడియాట్రిక్, అనెస్థీషియా, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రేడియాలజీ తదితర విభాగాలకు చెందిన స్పెషలిస్టు వైద్యులే ఉండటం గమనార్హం. ఎంతో కీలకమైన విభాగాల్లో పనిచేసే వారందరికీ షోకాజ్‌ నోటీసులు జారీ కావడంతో వైద్య వర్గాలు ఉలిక్కిపడ్డాయి. నోటీసులకు సరైన సమాధానం ఇవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే నోటీసులు అందుకున్న డాక్టర్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. 

గతేడాదే భర్తీ ప్రక్రియ... 
రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో 125 ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. అందులో 31 జిల్లా ఆసుపత్రులు, 22 ఏరియా ఆసుపత్రులు, 58 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హైదరాబాద్‌లో 14 ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్లు ఉన్నాయి. వాటిల్లో వైద్యుల నియామకం కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ), తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో గతేడాది వైద్యుల భర్తీ ప్రక్రియ జరిగింది. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో గతేడాది జులైలో ఏకంగా 15 రకాల స్పెషలిస్టు వైద్యులను భర్తీ చేశారు. వాటిల్లో మొత్తం 919 మంది స్పెషలిస్టు వైద్యులను నియమించారు. అయితే తమకు ఇష్టమైన చోట పోస్టింగ్‌లు ఇవ్వలేదని అనేక మంది అసంతృప్తితో ఉన్నారు. చేరిన వారిలో 500 మందికి మించి విధులకు హాజరు కావడం లేదన్న విమర్శలు వచ్చాయి. మిగిలిన వారిలో కొందరు విధులకు డుమ్మా కొడుతుండగా 128 మంది దూరాభారం అంటూ ఉద్యోగాలనే వదిలేసుకున్న పరిస్థితి నెలకొంది. మరోసారి వెబ్‌ కౌన్సిలింగ్‌ పెట్టి ఏర్పాట్లు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. స్పెషలిస్టు వైద్యులు చాలామంది గైర్హాజర్‌ అవుతుండటంతో వైద్య విధాన కమిషనర్‌ షోకాజ్‌ నోటీసులు జారీచేయడంతో ఏం జరుగుతుందా అన్న చర్చ జరుగుతోంది. 

కొరవడిన పర్యవేక్షణ... 
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తుంది. కేసీఆర్‌ కిట్, కంటి వెలుగు తదితర అనేక రకాల పథకాలకు శ్రీకారం చుట్టింది. అంతేకాదు అనేక ఆసుపత్రులను బలోపేతం చేసింది. ఇంత చేస్తున్నా ఆసుపత్రులను సమగ్రంగా నడపడంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో పరిస్థితి చిన్నాభిన్నమైంది. దీంతో జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలపై పర్యవేక్షణ కరువైంది. ఇటీవల భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సహా ముగ్గురు డాక్టర్లు... డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్‌కు వెళ్లిన ఘటన బయటపడింది. ఖమ్మంలో బాలింతలకు సెక్యూరిటీ సిబ్బంది సెలైన్‌ పెట్టిన ఘటన సంచలనం రేపింది మిగతా దవాఖాన్లలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఆసుపత్రుల సూపరింటెండెంట్ల నుంచి డాక్టర్లు, అధికారులు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. పైగా వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌గా హైదరాబాద్‌ కలెక్టర్‌ మాణిక్‌రాజే కొనసాగడం, ఆయనకు రోజువారీ కలెక్టర్‌ విధులతోపాటు ఆరోగ్యశ్రీ ఇన్‌చార్జిగా సైతం బాధ్యతలు ఉండటంతో ఏ విభాగాన్నీ పూర్తిస్థాయిలో పర్యవేక్షించే పరిస్థితి లేకుండా పోయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement