మార్చి 4న షీ టీమ్స్‌ రన్‌

She teams run on March 4th - Sakshi

మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహణ 

సాక్షి, హైదరాబాద్‌: మహిళల భద్రత విషయంలో షీటీమ్స్‌ చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రన్‌ నిర్వహిస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 4న పీపుల్స్‌ ప్లాజా వద్ద 10కే, 5కే, 2కే రన్‌ నిర్వహిస్తున్నామని, మార్చి 3, 4ల్లో షీటీమ్స్‌ ఎక్స్‌పో ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎక్స్‌పో కార్యక్రమాన్ని హోంమంత్రి నాయిని ప్రారంభిస్తారని చెప్పారు. మరుసటి రోజు జరిగే రన్‌ కార్యక్రమానికి అతిథులుగా క్రీడాకారిణి పీవీ సింధు, నటుడు దేవరకొండ విజయ్‌ హాజరవుతారని తెలిపారు.

ఎక్స్‌పోలో షీటీమ్స్‌ చేపడుతున్న కార్యక్రమాలు, భరోసా కేంద్రం ద్వారా మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు www.events now.comలో ద్వారా లేదా షీటీమ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. రన్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి మెడల్‌ అందజేస్తామని చెప్పారు. 4న ఉదయం 6 గంటలకు రన్‌ ప్రారంభమవుతుందని, పీపుల్స్‌ ప్లాజాలోని షీటీమ్స్‌ స్టాల్స్‌లో 3న టీషర్ట్‌ను తీసుకోవాలన్నారు. కాలేజీ స్టూడెంట్స్‌కు రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఉండవని చెప్పారు. రన్‌కు సంబంధించిన టీషర్ట్, మెడల్స్, కరపత్రాలను డీజీపీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో శాంతి భద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ శ్రీనివాస్‌రావు, అదనపు కమిషనర్‌ స్వాతిలక్రా  పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top