తీవ్ర నిర్ణయాలకూ వెనుకాడం

ప్రభుత్వ తీరుపై ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌ల నారాజ్‌

ప్రాధాన్యత పోస్టులు అడిగినా పట్టించుకోవడంలేదని మండిపాటు

ఓ రిటైర్డ్‌ ఉన్నతాధికారి వల్లే సమస్య అని ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొందరు ఐఏఎస్‌లకు ప్రాధాన్యత పోస్టులు లభించకపోవడంపై తలెత్తిన వివాదం ఇంకా కొలిక్కిరాలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమకు ప్రాధాన్యత పోస్టులు ఇవ్వడంలేదని ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌ అధికారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గత నెలాఖరులో ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషికి ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోస్టింగ్‌ల విషయంలో ఒక్కొక్కరినీ ఒక్కో తీరుగా చూడటం ప్రభుత్వానికి మంచిదికాదని అంటున్నారు. ప్రభుత్వం అందరికీ అన్ని రకాల పోస్టులను కేటాయించి ప్రజలకు సమర్థ పాలన అందించేలా చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి ఉద్దేశాలు లేకపోయినా... రిటైర్‌ అయిన ఓ సీనియర్‌ అధికారి తీరుతోనే సమస్య వస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే తీవ్ర నిర్ణయాలకు వెనుకాడబోమని పలువురు ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లు గట్టిగానే చెబుతున్నారు.
 
అదే అసంతృప్తి... 
ఎలాంటి తప్పు చేయకపోయినా తమను అప్రాధాన్య పోస్టులకు పరిమితం చేస్తున్నారని, కనీస ప్రాధాన్యత ఉండటంలేదని పలువురు ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లు అంటున్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో ఐఏఎస్‌ల కొరత ఉందని చెబుతున్న ప్రభుత్వం... పోస్టింగ్‌ల విషయంలో మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం ఉంది. ఐఏఎస్‌ స్థాయి అధికారుల పోస్టులను రాష్ట్ర స్థాయి అధికారులతో భర్తీ చేయడంతోపాటు రాష్ట్ర స్థాయి అధికారుల పోస్టుల్లో ఐఏఎస్‌లను ప్రభుత్వం నియమిస్తోందని, సీనియారిటీ, నిబద్ధతను పట్టించుకోకుండా పోస్టింగ్‌లలో తమకు అన్యాయం చేస్తోందని వారు చెబుతున్నారు.

కొందరు ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లకు కలెక్టర్లుగా పనిచేసే అవకాశం రావడంలేదనే అభిప్రాయం ఉంది. సామాజిక కోణంలో తమకు అన్యాయం జరుగుతోందని, న్యాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషిని గత నెల 26న కలిశారు. ఆ తర్వాత రోజు లిఖితపూర్వకంగా అందజేశారు. అప్రాధాన్య పోస్టులను కేటాయించడమే కాకుండా... ఐఏఎస్‌ అధికారి స్థాయికి ఉండే కనీస వసతులను కల్పించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కనీసం ఒక్క అటెండర్, సరైన వాహనం లేని పరిస్థితుల్లో కొందరు ఐఏఎస్‌లు ఉన్నారని వాపోయారు.  

ఇదీ వాదన... 
తమను ప్రాధాన్యతలేని పోస్టుల్లో నియమించడంపై నలుగురు జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఓ సీనియర్‌ అధికారిని ఏకంగా రాష్ట్ర స్థాయి అధికారి పోస్టులో నియమించడాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో ప్రాజెక్టు డైరెక్టర్లుగా పని చేసిన వారు ఇప్పుడు ముఖ్యకార్యదర్శులుగా కొనసాగుతున్నారని... కలెక్టర్లుగా పని చేసిన తాము గ్రూప్‌–2 స్థాయి పోస్టుల్లో పనిచేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ‘రాష్ట్రంలో 140 మంది ఐఏఎస్‌ అధికారులు ఉంటే అందులో 13 మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు.

వారిలో ఎక్కువ మంది ఇప్పటికీ కలెక్టర్‌ పోస్టుల్లో పనిచేయలేదు. కనీసం ఓ శాఖకు ఉన్నతాధికారి పోస్టులోనూ వారిని నియమించడంలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే తీవ్ర నిర్ణయాలు తీసుకునే దిశగా ఆలోచన ఉంటుంది’అని ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆవేదనతో చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top