పడావు భూములకు రైతు‘బందు’?

Samagra Land Survey In Telangana - Sakshi

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి):  రైతుబంధు పథకంలో అన్ని భూములకు కాకుండా సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు అనుమానిస్తున్నారు. రైతు సమగ్ర సర్వేలో పడావు భూములను ప్రత్యేకంగా గుర్తిస్తుండ డమే ఇందుకు కారణం.. దీంతో పడావు భూములకు పెట్టుబడి సాయం అందకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది.  రైతు సమగ్ర సర్వేలో ప్రత్యేక కాలం చేర్చడమే ఈ ప్రచారానికి బలం చేకూర్చు తోంది. పెట్టుబడి సాయం పేర రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎకరాకు ఒక సీజన్‌లో రూ. 4 వేల చొప్పున ఇంత వరకు రెండు సీజన్లకుగాను ఏడాదిలో రూ. 8వేల చొప్పున రైతులకు అందించారు.

ఈ ఖరీఫ్‌ సీజన్‌నుంచి పెట్టుబడి సాయం పెంచుతామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. సీజన్‌కు ఎకరానికి రూ. 5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10వేలు అందిస్తామని తెలిపింది. పెట్టుబడి సాయం పెరుగుతుందని ఆశపడ్డ రైతులకు.. సమగ్ర సర్వేలో పొందుపరిచిన అంశం నిరాశకు గురిచేస్తుంది. పెట్టుబడి సాయంలో కోతలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సర్వేలో కొత్తగా పడావు భూముల వివరాలు సేకరిస్తుండడంతో.. ఆ భూములకు రైతుబంధు ఇవ్వరేమోనన్న ప్రచారం జరుగుతోంది. గతంలో రైతుబంధు వివరాలు సేకరించినప్పుడు పడావు భూముల వివరాలు లేవు. భూమి ఉంటే చాలు సాగులో ఉందా లేదా అనే అంశంతో నిమిత్తం లేకుండా రైతుబంధు పథకం వర్తింపజేశారు. ఇప్పుడు పడావు భూముల అంశం చేర్చడంతో ఎన్నికల నేపథ్యంలో ఎకరాకు ఒక సీజన్‌లో రూ. వెయ్యి చొప్పున పెంచిన భారాన్ని ప్రభుత్వం తగ్గించుకునే ప్రక్రియలో భాగంగానే పడావు భూముల అంశం తీసుకువచ్చిందని రైతులు అనుమానిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top