ఎన్నికలకు ‘ఆర్టీసీ’ సిద్ధం..!

RTC Buses Arrangements Regarding Telangana Elections In Nalgonda - Sakshi

     ఉమ్మడి నల్లగొండ జిల్లాలో  364 బస్సులు

     డిసెంబరు 6,7 తేదీల్లో ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

     రోడ్డు రవాణా సంస్థకు రూ.1.52 కోట్ల చెల్లింపు 

సాక్షి,మిర్యాలగూడ టౌన్‌ :  తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉంటూ నిత్యం సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంలో ముందుండే ఆర్టీసీ సంస్థ ఎన్నికల రూపంలో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను ఈ ఎన్నికల్లో రీజియన్‌కు రూ.32లక్షలకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి 364 ఆర్టీసీ బస్సులతో పాటు 7డీజీటీ(ఆర్టీసీ గూడ్స్‌)లను ఈ ఎన్నికల్లో రెండు రోజుల పాటు సేవలు అందించనున్నాయి. అందుకుగాను ఒక్కొక్క బస్సుకు రూ.21వేల చొప్పున ఎన్నికల కమిషన్‌ ఆర్టీసీ సంస్థకు అద్దే రూపంలో చెల్లించనున్నది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఎన్నికల నిర్వహణకు ఆర్టీసీ బస్సులను అన్నీ విధాలుగా అధికారులు సిద్ధం చేశారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, పోలీసులు, ఈవీఎంలను తరలించేందుకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తోంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఆర్టీసీ అధికారులకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలనుఆర్టీసీ రీజినల్‌కు పంపించిన విషయం విధితమేఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఆర్టీసీ బస్సులను సన్నద్ధం చేయాలని ఇప్పటికే ఆర్‌ఎంకు అందించిన లేఖలో పేర్కొనడంతో ఆయన ఆదేశాల మేరకు ఎన్నికలకు అవసరమైన ఆర్టీసీ బస్సులను రీజియన్‌లోని కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, నల్లగొండ, నార్కట్‌పల్లి, యాదగరిగుట్ట డీపోలలో అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

ఎన్నికల నిర్వహణలో పాల్గొనే పొలింగ్‌ సిబ్బందిని మొదలుకుని పోలీస్‌ యంత్రాంగం, ఈవీఎంల తరలింపు తదితర రవాణా సౌకర్యాలకు ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నారు. ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేపట్టింది. అందులో ప్రధానంగా ఈవీఎంల తరలింపు ఎంతో భద్రతతో కూడిన పని కావడంతో డీపో గ్యారేజీ ట్రాన్స్‌ఫోర్ట్‌(గూడ్స్‌)బస్సులో ఈవీఎంలను తరలించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.మరో వైపు ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది ఆయా పోలింగ్‌ బూత్‌లకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు డిపోలలోని బస్సులను ఎన్నికల నిర్వహణకు పంపించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.  

ఉమ్మడి జిల్లాలో 364 బస్సులు :
ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ, యాదాద్రి భునవగిరి, నల్లగొండ, సూర్యాపేట, నార్కట్‌పల్లి డిపోలకు చెందిన 364 ఆర్టీసీ బస్సులతో పాటు 7 డీజీటీ బస్సులను ఈ ఎన్నికలకు ఆర్టీసీ బస్సులు అవసరమని ఎన్నికల కమిషన్‌ కోరింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు డీపోల్లో సుమారు 800 ఆర్టీసీ బస్సులు ఉండగా అందులో సగానికి పైగా ఎన్నికల నిర్వహణ కోసమే తరలించనున్నారు. ప్రధానంగా డిసెంబరు 6, 7వ తేదీల్లో ఆర్టీసీ బస్సులను ఎన్నికల అధికారులు ఉపయోగించనున్నారు. అయితే నల్లగొండ జిల్లాలో 150 ఆర్టీసీ బస్సులతో పాటు 4డీజీటీ బస్సులు, సూర్యాపేట జిల్లాలోని 150 ఆర్టీసీ బస్సులు రెండు డీజీటీ బస్సులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 64 ఆర్టీసీ బస్సులు ఒక డీజీటీ బస్సును ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉన్నందున నల్లగొండ జిల్లా నుంచి కొన్నింటిని తరలి స్తున్నారు. ఏడు డిపోలు కలిసి 364 ఆర్టీసీ బస్సులు ఎన్ని కల విధుల్లో ఉంటాయి. రెండు రోజుల పాటు ఎన్ని కల వి«ధుల్లో ఉన్నంతరం ఎన్నికలు ముగియగా నే తిరిగి ఏ బస్సులు ఆ డిపోలకు వెళ్లిపోనున్నాయి. 
ఆర్టీసీకి చేకూరనున్న భారీ ఆదాయం :
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ అదనపు ఆదాయాన్ని చేకూర్చుకొనున్నది. నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీకి అసెంబ్లీ ఎన్నికలు కొంత వరకు లాభాన్ని చేకురుస్తుంది.ఎన్నికలకు ఉపయోగించే ఆర్టీసీ బస్సులకు ఒక్కదానికి 21వేయి రూపాయలను ఆర్టీసీ సంస్థకు ఎన్నికల అధికారులు చెల్లించనున్నది. ఈ లెక్కన చూస్తే 364 ఆర్టీసీ బస్సులకు రెండు రోజులకు గాను రూ.1.52కోట్ల వరకు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. ఈవీఎంలను తరలించేందుకు ఏర్పాటు చేసే డీజీటీ బస్సులకు మరో రెండు లక్షల 10వేల రూపాయల వరకు ఆదాయం రానున్నది. అన్నీ ఖర్చులు పోను ఒక్కో  ఆర్టీసీ బస్సుకు రూ.4 నుంచి 5వేల వరకు మిగులుబాటు ఉండవచ్చని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆర్టీసీ బస్సులను ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు బస్సులను ఉపయోగిస్తే ఆ సమయంలో ఒక్కో బస్సుకు కేవలం రూ.14వేల చొప్పున చెల్లించారు. కానీ ప్రస్తుతం పెరిగిన డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులతో ఈ సారి ఒక్కో బస్సుకు రూ.21వెయ్యి  వరకు చెల్లించేందుకు ఎన్నికల కమిషన్‌ ముందుకు వచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రెండు రోజులకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో సంస్థ నిర్వహణ ఖర్చులు పోను 25లక్షల రూపాయల వరకు మిగిలే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నల్లగొండ రీజియన్‌లో గత ఎప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ సంస్థ ఆరు కోట్ల రూపాయల వరకు నష్టాల్లో ఉందని అంటున్నారు. కాగా బహిరంగం సభలకు కూడా ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో కొంత మేరకు ఆదాయం పెరుగనున్నది.  

డిసెంబరు 6, 7 తేదీల్లో ఇక్కట్లు : 
అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండటంతో డిసెంబరు 6, 7వ తేదీల నల్లగొండ రీజియన్‌లో పరిధిలో ఆర్టీసీ బస్సులు ఎన్నికల్లో భాగంగా తగ్గనున్నాయి. 7వ తేదీన ఎన్నికలు అయినందున ఒక రోజు ముందుగానే ఆర్టీసీ బస్సులో సిబ్బందిని, ఈవీఎంలను తరలించేందుకు  రెండు రోజుల పాటు బస్సులను ఉపయోగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో 364 ఆర్టీసీ బస్సులు సగానికి పైగా తగ్గుతుండటంతో ప్రధాన రూట్లు అయిన మిర్యాలగూడ నుంచి దేవరకొండ, కోదాడ, నల్లగొండ, సూర్యాపేట తదితర ప్రాంతాలకు బస్సులు తగ్గనున్నాయి. ఈ రెండు రోజులు ఆయా ప్రాంతాలకు సుమారు 10 ఆర్టీసీ బస్సులను మాత్రమే పంపించనున్నారు. అదే విధంగా డిసెంబరు మొదటి వారంలో కూడా పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా అధికంగా ఉన్నందున ఆ బస్సులను ఎన్నికలకు తరలించడంతో ఆ రెండు రోజుల పాటు ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది.  
ప్రత్యేక చర్యలు తీసుకుంటాం:
ఎన్నికల నిర్వహణకు ఆర్టీసీ బస్సులను వినియోగించడం వలన కొంత వరకు ఆర్టీసీ బస్సులు తగ్గినప్పటికి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలను చేపడతాం. బస్సులను స్పెషల్‌ ఆపరేషన్‌ను చేయించి ఇబ్బందులు రాకుండా చర్యలను తీ సుకుంటాం. కాగా డిసెంబరు 6, 7వ తేదీల్లో 48 గంటల పాటు ఆర్టీసీ సంస్థకు ప్రయాణికులు సహకరిం చాలి.


– సుధాకర్‌రావు, ఆర్టీసీ డీఎం, మిర్యాలగూడ  
   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top