‘సాగు’.. బాగు బాగు | Sakshi
Sakshi News home page

‘సాగు’.. బాగు బాగు

Published Fri, Mar 16 2018 4:09 AM

Rs 25,000 crore is allocated for the third time in irrigation - Sakshi

తాజా బడ్జెట్‌లో సాగునీటి రంగానికి నిధుల ప్రవాహం కొనసాగింది. సాగునీటి కోసం ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని రెండేళ్ల కింద సీఎం కేసీఆర్‌ ప్రకటించిన మేరకు.. 2018–19 బడ్జెట్‌లోనూ రూ.25 వేల కోట్లు కేటాయించారు. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.22,301.35 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.3,698.65 కోట్లు ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈసారి కూడా నిధుల్లో అగ్రతాంబూలం దక్కింది. పాలమూరు–రంగారెడ్డితోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టులకూ ప్రాధాన్యమిచ్చారు. సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, నిధుల సమీకరించనున్న దృష్ట్యా.. దేవాదుల ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా రూ.1,966 కోట్లు కేటాయించారు. కార్పొరేషన్‌ పరిధిలోకి వచ్చే సీతారామ, తుపాకులగూడెం, ఇందిరమ్మ వరద కాల్వలకూ పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇచ్చారు.
– సాక్షి, హైదరాబాద్‌

రెండు ప్రాజెక్టులకు భారీగా..
ఈసారి సాగునీటి బడ్జెట్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.6,094 కోట్లు ఇచ్చారు. గతేడాది ఈ ప్రాజెక్టుకు కేటాయిం చిన నిధులతోపాటు కార్పొరేషన్‌ ద్వారా రూ.9 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. మొత్తంగా రూ.13 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. ఈ ఏడాది కూడా కార్పొరేషన్‌ రుణాలు కలిపి ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గతేడాది రూ.4 వేల కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.3 వేల కోట్లు ఇచ్చారు. ముఖ్యంగా ఈసారి డిండి, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ వంటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. 

చిన్న నీటి వనరులకు రూ.2,415 కోట్లు..
చిన్న నీటి వనరులకు ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపులు పెరిగాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్‌ కాకతీయ కింద 7 వేల చెరువులను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో కేటాయింపులు పెంచారు. మొత్తంగా చిన్న నీటి వనరుల అభివృద్ధికి గతేడాది రూ.2 వేల కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది రూ.2,415 కోట్లు ఇచ్చారు. ఇందులో మిషన్‌ కాకతీయకు రూ.1,500 కోట్లు కేటాయించారు. గతేడాది మిషన్‌ కాకతీయకు రూ.1,243 కోట్లు కేటాయించగా.. రూ.1,233 కోట్లకు సవరించారు. భూగర్భ జల వనరుల అభివృద్ధికి రూ.77.50 కోట్లు ఇచ్చారు. ఇక చిన్న నీటి వనరుల అభివృద్ధి కోసం కేంద్ర పథకాలైన గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృధ్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్‌) నుంచి రూ.244 కోట్లు, సాగునీటి సత్వర ప్రాయోజిత పథకం (ఏఐబీపీ) కింద రూ.65 కోట్లు వస్తాయని  ప్రభుత్వం అంచనా వేసింది. 

కేటాయింపులు ఘనం.. రుణాలే ఆధారం!
వేగంగా ప్రాజెక్టులను పూర్తిచేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఎన్నడూ లేనంతగా గతేడాది సాగునీటికి రూ.26 వేల కోట్లకుపైగా కేటాయించింది. కానీ చివరికి వ్యయాన్ని రూ.20 వేల కోట్లకు సవరించింది. ఇందులో కార్పొరేషన్ల పేరిట రుణాలే ఎక్కువగా ఉన్నాయి. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టుల కింద చేసిన ఖర్చు అంతంత మాత్రంగానే ఉండటం గమనార్హం. గతేడాది ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.13,107 కోట్లు ఖర్చుచేయగా.. అందులో కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణాలే రూ.9,013 కోట్లు. అంటే ఈ రుణాలు తీసేస్తే.. రాష్ట్ర నిధుల్లోంచి జరిపిన కేటాయింపులు రూ.11 వేల కోట్లు మాత్రమే. ఈసారి సైతం దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులకు కలిపి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నందున.. మళ్లీ రుణాలతోనే గట్టెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాజెక్టులకు గతేడాది రూ.1,720 కోట్లు కేటాయించినా.. చివరికి రూ.645.48 కోట్లకు సవరించారు. ముఖ్యంగా కల్వకుర్తికి బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించగా.. రూ.370 కోట్లే ఖర్చు చేశారు. ఈ ఏడాది తిరిగి రూ.500 కోట్లు కేటాయించారు. నెట్టెంపాడుకు గతేడాది రూ.235 కోట్లు కేటాయించినా.. రూ.70 కోట్లకు సవరించారు.
- ప్రాణహిత ప్రాజెక్టుకు నిధులను రూ.775 కోట్ల నుంచి రూ.220 కోట్లకు.. డిండికి రూ.500 కోట్ల నుంచి రూ.260 కోట్లకు.. తుపాకులగూడేనికి రూ.505 కోట్లకుగాను రూ.120 కోట్లకు సవరించారు.
- ప్రధాన ప్రాజెక్టు అయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.4 వేల కోట్లు కేటాయించినా.. చివరికి రూ.1,660 కోట్లకు తగ్గించారు.
- కోయిల్‌సాగర్, భీమా, దిగువ పెన్‌గంగ, ఎల్లంపల్లి పరిధిలోనూ కేటా యింపులు భారీగా చూపినా నిధుల ఖర్చు అంతంత మాత్రంగానే ఉంది.
- చాలా ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ, సహాయ పునరావాస సమస్యలు, కేంద్ర సంస్థల నుంచి అటవీ, పర్యావరణ అనుమతుల జాప్యం, కోర్టుల కేసుల కారణంగా ప్రాజెక్టుల పరిధిలో అనుకున్న నిధుల ఖర్చు జరగలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement