మాజీ డీజీపీ ఆనందరాం కన్నుమూత 

Retired IAS And AP Former DGP Ananda Ram No More - Sakshi

ఇందిర హత్య కేసు దర్యాప్తు చేసిన ‘సిట్‌’కు నేతృత్వం వహించిన అధికారి 

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ, దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య కేసును ఛేదించిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఎస్‌. ఆనందరాం (97) శుక్రవారం హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలోని తన నివాసంలో కన్ను మూశారు.1950లో సివిల్‌ సర్వీస్‌లో చేరిన ఆనందరాం 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి డీజీపీగా సేవలందించారు.ఆనందరాం రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగంలో పనిచేసి ఎన్నో కేసులు ఛేదించారు. ఆయన ఉత్తమ సేవలకు గాను 1962లో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ మెడల్, 1975లో ప్రెసిడెంట్స్‌ పోలీస్‌ మెడల్‌ అందుకున్నారు. 1978 –81 వరకు విశాఖ షిప్‌యార్డు సీఎండీగా, అలాగే నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ వైస్‌ చైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు.

హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌కు సేవలందించారు. ఆయనకు 1987లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయన 1984లో సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌గా ఢిల్లీలో పనిచేస్తున్న సమయంలో ఇందిరాగాంధీ హత్య కేసును దర్యాప్తు చేసేందుకు నియమించిన ‘సిట్‌’కు నాయకత్వం వహించారు. అనంతరం ఆనందరాం ‘అసాసినేషన్‌ ఆఫ్‌ ఏ ప్రైమినిస్టర్‌’పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించారు. కాగా ఆనందరాం మరణ వార్త తెలిసిన వెంటనే డీజీపీ మహేందర్‌రెడ్డి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.ఆనందరాం భౌతికకాయానికి శనివారం ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమారుడు శ్రీకాంత్‌ తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top