
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే పరిస్థితుల నేపథ్యంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలవరం ముంపు ప్రాంతాలపై చర్చ మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల భౌతిక స్వరూపం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 జూలై 11న భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకర్గాల్లోని 211 గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లోకి మారుస్తూ కేంద్రం ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ఈ మూడు నియోజకవర్గాలు రెండు రాష్ట్రాల పరిధిలోకి మారాయి. ఈ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు మాత్రం రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నా తెలంగాణలోని ప్రాంతానికే ఇక్కడి ప్రభుత్వం నిధులు మంజూరు చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు అస్పష్టత ఉన్న ఈ నియోజకర్గాల విషయంలో వచ్చే ఎన్నికల్లో స్పష్టత రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇక్కడి ప్రాంతాల వరకే..
మూడు నియోజకవర్గాలకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న ప్రాంతాల వరకు నియోజకవర్గంగా గుర్తించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లిన ప్రాంతాలను అక్కడి రంపచోడవరం, జంగారెడ్డిగూడెం నియోజకవర్గాల్లో చేర్చుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది. వీఆర్‌పురం, చింతూరు, కూనవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాలు పూర్తిగా ఏపీలో విలీనం చేశారు. భద్రాచలం మండలంలోని పట్టణం మినహా మిగిలిన గ్రామాలు, బూర్గంపాడు మండలంలోని ఏడు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. భద్రాచలం పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ప్రాంతాన్ని అక్కడి ప్రభుత్వం ఏటపాక మండలంగా మార్చింది. ఏటపాక, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం మండలాలను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకర్గంలో కలిపారు. వేలేరుపాడు, కూకునూరు మండలాలను, బూర్గంపాడు మండలంలోని ఏడు గ్రామాలను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నియోజకవర్గంలో కలిపారు.
ఇక్కడ పరిధి తగ్గింపు..
2009, 2014 ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధి తగ్గింది. ఓటర్ల సంఖ్య కూడా తగ్గింది. మూడు నియోజకవర్గాల్లో కలిపి 43,615 ఓట్లు తగ్గాయి. ఓటర్ల సంఖ్య తగ్గడంతో ఈ సెగ్మెంట్లలోని ఎస్టీ ఓటర్ల సంఖ్యలో మార్పులు వచ్చాయని.. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల పునర్విభజన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని డిమాండ్ చేస్తోంది.