పంచకూటాలయానికి మోక్షం

పంచకూటాలయానికి మోక్షం


నేడు మొదలు కానున్న పునర్నిర్మాణ పనులు

పనులు ప్రారంభించాలని ఆదేశించిన మంత్రి చందూలాల్‌




సాక్షి, హైదరాబాద్‌: అత్యంత అరుదైన పురాతన పంచకూటాలయానికి ఎట్టకేలకు మంచి రోజులొచ్చాయి. భూపాలపల్లి జిల్లా రామానుజాపూర్‌లో కాకతీయుల కాలం (13వ శతాబ్దం)లో నిర్మితమై శిథిలమైన పంచకూటాలయం పునర్నిర్మాణ పనులు ఆదివారం మొదలవుతున్నాయి. పురావస్తు శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి చందూలాల్‌ సొంత ప్రాంతంలో రాజకీయ విభేదాలతో అధికార పక్ష నేతలే దీని పునర్నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో అత్యంత విలువైన శిల్పసంపద మట్టిలో కూరుకుపోయిన తీరును ‘సాక్షి’వెలుగులోకి తేవటంతో దాన్ని పునర్నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేయనున్నారు.



కాకతీయుల నాటి అద్భుత కట్టడం..

వెంకటాపురం మండలంలోని రామానుజా పూర్‌ గ్రామ శివారులో 13వ శతాబ్దంలో కాకతీయులు అద్భుతంగా పంచకూటాలయం నిర్మించారు. ఒకే మండపంలో ఐదు విడివిడి ఆలయాలుంటాయి. ముస్లిం పాలకులు గతంలో ఈ ఆలయాన్ని కొంతమేర ధ్వంసం చేశారు. మిగిలిన ప్రాంతం కూడా సరిగా పట్టించుకోకపోవటంతో కాలక్రమంలో అది కూడా పడిపోయింది. రెండున్నర దశాబ్దాల కింద దాన్ని గ్రామానికి చేరువగా మరోచోట పునర్నిర్మించాలని పురావస్తుశాఖ నిర్ణయించిం ది. ఇంజనీరింగ్‌ నిపుణుల పర్యవేక్షణలో ఆలయ రాళ్లను జాగ్రత్తగా విడదీశారు. అయితే పనులు ప్రారంభం కాలేదు. మూడేళ్ల కింద రూ.కోటి అంచనాతో పనులు చేపట్టాలని నిర్ణయించగా కాంగ్రెస్‌ నేత ఒకరు తన అధీనంలో ఉన్న గ్రామకంఠం భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చారు.


రూ.10లక్షలు వెచ్చించి స్థలాన్ని చదు ను చేసి పనులు మొదలుపెట్టే సమ యంలో అధికారపార్టీ నేతలు ఆ పనులు అడ్డు కున్నారు. కాంగ్రెస్‌ నేత స్థలంలో నిర్మిస్తే ఆయనకు పేరొస్తుందన్న ఉద్దేశంతో పాటు మంత్రికి ప్రాధాన్యమివ్వకుండా వ్యవహరిం చారని ఈ పనులు ఆపారు. ఇంతజరిగినా మంత్రి పట్టించుకోకపోవడంతో మొదలు కాలేదు. ఆలయం తాలూకు శిల్ప సంపద మట్టికొట్టుకుపోయింది. ఈ వివరాలను సచిత్రంగా ఇటీవల ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. పురావస్తు శాఖను పర్యవేక్షించే మంత్రి ఇలాఖాలోనే ఈ దుస్థితి ఏర్పడటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో సమీపంలోనే మరో స్థలాన్ని ఎంపిక చేయించి పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలని మంత్రి నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top