రాష్ట్రంలో జోరుగా మద్యం అమ్మకాలు 

Record Sales of Liquor In Telangana - Sakshi

ఈ ఏడాది ఇప్పటివరకు రూ.6,231 కోట్ల విక్రయం 

లిక్కర్‌ అమ్మకాల విలువ రూ.4,376 కోట్లు, బీర్ల లెక్క రూ.1,855 కోట్లు 

పదేళ్ల రికార్డు అంటున్న అధికారులు.. గతేడాదితో పోలిస్తే రూ.900 కోట్లు ఎక్కువ

సాక్షి, హైదరాబాద్‌ : లిక్కర్‌ కిక్‌.. రికార్డులు బ్రేక్‌ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచీ ప్రతి నెలా మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకు రూ.6,231 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌ గణాంకాలు చెపుతున్నాయి. దీని ప్రకారం గత ఆరు నెలల్లో రూ.4,376.76 కోట్ల లిక్కర్, రూ.1,855.03 కోట్ల విలువైన బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు రూ.900 కోట్లు ఎక్కువ. ఈ ఏడాది అమ్మకాలు గత పదేళ్లలోనే రికార్డు అని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ఏర్పాటు అనం తరం తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలతో పాటు కల్తీలను నియంత్రించడంలో సఫలీకృతమైనందునే ఈ మేరకు విక్రయాలు పెరిగాయంటున్నారు. 

90 లక్షల లిక్కర్‌ కేసులు 
గత ఆరు నెలల్లో 90 లక్షలకుపైగా లిక్కర్‌ కేసులు అమ్ముడుపోయాయని, తద్వారా రూ.4,376 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు చెపుతున్నాయి. బీర్లు కూడా జోరుగా అమ్ముడవుతున్నాయి. ఇప్పటివరకు 1.8 కోట్ల కేసుల బీర్లు అమ్మడం ద్వారా టీపీబీసీఎల్‌కు రూ.1,855 కోట్లు సమకూరాయి. డిపోలవారీగా చూస్తే మహబూబ్‌నగర్‌(రూ.497.13 కోట్లు), నల్లగొండ (రూ.481.50 కోట్లు), మేడ్చల్‌–2(రూ.479.57 కోట్లు) డిపోల్లో మద్యం విక్రయాలు జరిగాయి. ఈ మూడు డిపోల నుంచే రూ.1,430 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు రూ.900 కోట్లకుపైగా ఎక్కువ అమ్మకాలు జరిగాయి. గత ఏడాది ఇదే సమయానికి రూ.3,787.14 కోట్ల విలువైన లిక్కర్, రూ.1,539 కోట్ల విలువైన బీర్లు ఐఎంఎల్‌ఎప్‌ డిపోల నుంచి అమ్ముడయ్యాయి. 

మూడు ముఖ్య కారణాలు 
మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగేందుకు మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గుడుంబా విక్రయాలపై ఎక్సైజ్‌ శాఖ ఉక్కుపాదం మోపింది. దాదాపు అన్ని జిల్లాలనూ గుడుంబారహిత జిల్లాలుగా ప్రకటించింది. గుడుంబా అమ్మకందారులకు పునరావాస ప్యాకేజీని కూడా పకడ్బందీగా అమలు చేసింది. దీంతో రాష్ట్రంలోని గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో గుడుంబా విక్రయాలు పూర్తిగా ఆగిపోయాయి. మత్తు కల్లును నియంత్రించడంలోనూ ఎక్సైజ్‌ శాఖ కృషి ఫలించింది. దీంతో గుడుంబా, మత్తు కల్లు అలవాటున్న వారంతా మద్యంవైపు వెళ్లాల్సిన పరిస్థితులను కల్పించింది. కల్తీ మద్యం అరికట్టడంలోనూ ఎక్సైజ్‌ శాఖ మంచి పనితీరు కనబరుస్తోంది.

మద్యం తయారీ నుంచి సరఫరా, విక్రయాల వరకూ మూడు దశల్లో ఎక్కడా కల్తీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యాన్ని నివారించడంలో కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సఫలీకృతమయింది. గతంలో డిస్టిలరీల నుంచి నేరుగా కల్తీ మద్యం బయటకు వెళ్లేది. హాలోగ్రామ్‌ విధానం తెచ్చిన ఈ నాలుగేళ్లలో మద్యం విక్రయాలు పెరిగాయని, ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతోందని రెవెన్యూ శాఖ ప్రభుత్వానికిచ్చిన నివేదికలో పేర్కొంది. కల్తీలను అరికట్టడం, కచ్చితమైన విధానాలను అమల్లోకి తేవడం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చురుకుగా ఉండటం లాంటి అంశాలు రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగేందుకు కారణమని ఎక్సైజ్‌ శాఖ అధికారులు చెపుతున్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top