రక్తమోడిన రహదారులు

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

హైదరాబాద్‌లో మరొకరు..

పలువురికి తీవ్ర గాయాలు..

ఆస్పత్రికి తరలింపు

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రహదారులు రక్తమోడాయి.. శుక్రవారం వివిధ చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలవగా.. హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో మరో వ్యక్తిమృతి చెందాడు.. ఆయా ప్రమాదాల్లో తీవ్ర గాయా లపాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొం దుతున్నారు. ఆయా సంఘ టనలకు సంబంధించి వివరాలిలా..

అమరచింత (కొత్తకోట) : ఎదురుగా వచ్చిన ఎద్దులబండిని తప్పించబోయి కిందపడటంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని కొత్తతండా శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తుక్యానాయక్‌తండాకు చెందిన నేనావత్‌ రాములునాయక్‌(46) మస్తీపురం గ్రామ శివారులో 3 ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకుని వరిపంట సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య జయమ్మ, కోడలు చిట్టెమ్మలతో కలిసి ద్విచక్రవాహనంపై మస్తీపురంలోని వ్యవసాయ పొలం నుంచి తండాకు బయల్దేరారు. కొత్తతండా దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని తప్పించబోయి అదుపుతప్పి బైక్‌పై నుంచి ముగ్గురు కిందపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108లో ఆత్మకూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. రాములునాయక్‌ మార్గమధ్యలోనే మృతిచెందాడు. భార్య జయమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం వనపర్తి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు.

అన్నాసాగర్‌ సమీపంలో..
భూత్పూర్‌ (దేవరకద్ర): మండలంలోని అన్నాసాగర్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి బోల్తా పడగా ఒకరు మృతిచెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. కేరళలోని కోయికోడ్‌ జిల్లా వటగారా నియోజకవర్గం కొత్తపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్‌ లతీఫ్‌(40), భార్య ఆసియా, ఇద్దరు చిన్న కుమారులు మహమ్మద్, ఆఖీం, బంధువులు ఇస్మాయిల్, నాబీలాలతో పాటు డ్రైవర్‌ రియాజ్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని కల్యాణదుర్గం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో అన్నాసాగర్‌ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అబ్దుల్‌ లతీఫ్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. భార్య ఆసియా, కుమారులు మహమ్మద్, ఆఖీం, ఇస్మాయిల్, నబీలాలకు గాయాలవగా.. డ్రైవర్‌ రియాజ్‌కు కాలు విరిగింది. క్షతగాత్రులను అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top