
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఈనెల 19న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ రానున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్రపతి పర్యటనపై అధికారులతో సీఎస్ సమీక్షించారు.
రాష్ట్రపతి ఈ నెల 19న బేగంపేట విమానాశ్రయంకు మధ్యాహ్నం 2.55 కు చేరుకుంటారన్నారు. ఎయిర్ పోర్టులో ఏర్పాట్లు , ట్రాఫిక్, బందోబస్తు, స్వాగత తోరణాలు, నిరంతర విద్యుత్ సరఫరా, రోడ్లకు మరమ్మతులు, పారిశుద్ధ్యం, పరేడ్, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. 20న ట్యాంక్‌బండ్ వద్ద బుద్ధుని సందర్శించి పుష్పాంజలి ఘటిస్తారని అనంతరం తిరిగి ఢిల్లీకి పయనమవుతారన్నారు. ఈ నెల 23 నుండి శీతాకాల విడిదికి రాష్ట్రపతి విచ్చేయుచున్న నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా సీఎస్ అధికారులను ఆదేశించారు.