ఆటలో మేటి.. నాట్య మయూరి

Raja Sree Talent in Throw Ball Game And Classical Dance - Sakshi

జాతీయ త్రోబాల్‌ ప్లేయర్‌

తల్లి స్ఫూర్తితో భరతనాట్యం వైపు

రెండు రంగాల్లో దూసుకెళుతున్న రాజశ్రీ

హిమాయత్‌నగర్‌: ఆమె ఆటలోకి దిగితే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేగాల్సిందే. స్టేజీపై భరతనాట్యం ప్రదర్శిస్తే ప్రేక్షకులు మంత్రముగ్ధులు కావాల్సిందే. ఓ పక్క గేమ్‌లో బంగారు పతకాలను సాధిస్తూ.. ఇంకోపక్క నాట్యంలోనూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటోంది రాజశ్రీ శెట్టి. పదేళ్ల వయసులో తల్లి చెప్పిన మాటలను శాసనంగా తీసుకున్న ఆ యువతి చేసిన కృషి ఇప్పుడు త్రోబాల్‌ గేమ్‌లోనూ, భరతనాట్యంలోను మేటిగా దూసుకెళుతోంది జూబ్లీహిల్స్‌కు చెందిన రాఘవేంద్రప్రసాద్, సునీతసాపూర్‌ల కుమార్తె రాజశ్రీ. ప్రస్తుతం సెంట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీలో బిఎస్సీ చదువుతున్న ఈమె స్కూల్‌ డేస్‌లోనే త్రోబాల్, భరతనాట్యంపై ఇష్టం పెంచుకుంది.  

అమ్మ కోసం నాట్యం  
రాజశ్రీ తల్లి సునీత సాపూర్‌కి భరతనాట్యమంటే ఇష్టం. ఆమె చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకున్న విధానాన్ని కూతురుకు చెప్పేది. అంతేకాదు.. భరతనాట్యం ప్రాముఖ్యతను సైతం వివరిస్తుండేది. ఆ మాటలే రాజశ్రీని నాట్యం వైపు నడిపించాయి. ‘‘అప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా భరతనాట్యం నేర్చుకోవాలని. నాకు పదేళ్ల వయసప్పుడు ప్రముఖ భారతనాట్య గురువు హేమమాలిని ఆర్ని వద్ద నాట్యం నేర్చుకున్నాను. ఆమె నేర్పించే విధానం, చెబుతున్న తీరు అద్భుతం. అప్పటి వరకు మామూలుగా నేర్చుకుంటే పర్లేదనుకున్న నేను.. భరతనాట్యాన్ని సీరియస్‌గా తీసుకున్నాను. ప్రస్తుతం హేమమాలిని ఆర్నీ శిష్యురాలైన కిరణ్మయి మదుపు వద్ద నాట్యంలో మెళకువలు నేర్చుకుంటున్నాను’ అని చెప్పింది రాజశ్రీ.  

స్కూల్‌ టు నేషనల్స్‌
సిటీలో 2017లో నేషనల్స్‌ జరిగాయి. ఈ పోటీల్లో చాలా రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద క్రీడాకారులు వచ్చారు. సిటీ నుంచి రాజశ్రీ టీం కూడా పాల్గొని ఉత్తమ ప్రతిభ చాటింది. ఫైనల్లో వీరి జట్టు ఢిల్లీతో తలపడి విజేతగా నిలిచింది. ‘‘స్కూల్‌ నుంచి మొదలైన నా త్రోబాల్‌ ప్రయాణం నేషనల్స్‌ వరకు వచ్చింది. చిన్న చిన్న పతకాల నుంచి బంగారు పతకాలను సైతం సాధించగలిగాను. అమ్మాయిలు త్రోబాల్‌ని ఇంతబాగా ఆడతారా! అని మేం నేషనల్స్‌ గెలిచినప్పుడు ప్రతి ఒక్కరూ కితాబివ్వడం నాకు ఇప్పటికీ గుర్తే’ అంటూ ఆ నాటి సంఘటనలు వివరించింది. 

సరదా కోసం అలా..
రాజశ్రీకి అమ్మ చెప్పిన మాటలతో నాట్యం వైపు అడుగులు వేస్తే.. సహజరంగా చిన్నప్పటి నుంచి ఆటలపై ప్రేమ పెంచుకుంది. స్కూల్లో ఫ్రెండ్స్‌ ఆడుతున్నప్పుడు చూసి ఎంజాయ్‌ చేసే ఆమె.. వారితో ఓసారి అడితే బాగుంటుందని అటువైపు అడుగులేసింది. ‘‘సరదాగా ఓసారి త్రోబాల్‌ ఆటలోకి దిగాను. ఫ్రెండ్స్, స్కూల్‌లో ఉన్న వారి మధ్య సరదా కోసం ఆడిన ఆటలో బాగా ఆడుతున్నానంటూ మంచి కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. 8వ తరగతి నుంచి గేమ్‌పై మరింత ఇంట్రస్ట్‌ పెరిగింది. అప్పుడే స్కూల్‌ లెవెల్‌లో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నాను’ అని చెప్పింది. టీంతో పాటు బాగా ఆడి మంచి పేరు సంపాదించాక రాజశ్రీ జిల్లా, స్టేట్స్‌ లెవెల్‌లో కూడా ఆడుతూ ఈ క్రీడలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది.  

చదువు.. ఉద్యోగం ఉండాలి
ప్రస్తుతం డిగ్రీ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాను. ఎమ్మెస్సీ చేస్తా. ఇదే క్రమంలో గేమ్‌పై కూడా మరింత శ్రద్ధ చూపిస్తాను. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలి. భరతనాట్యం చేస్తూ..నా తోటివారిని ఈ సాంప్రదయానికి పరిచయం చేయాలి. భరతనాట్యంలో చెన్నై ప్రజల్ని మెప్పించగలిగితే చాలు.. అదే పెద్ద అచీవ్‌మెంట్‌.      – రాజశ్రీ శెట్టి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top