తెలంగాణలో జూన్ రెండో తేదీతో రాష్ట్రపతి పాలన ముగుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తర్వాత కూడా కొనసాగనుంది.
తెలంగాణలో జూన్ రెండో తేదీతో రాష్ట్రపతి పాలన ముగుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తర్వాత కూడా కొనసాగనుంది. రెండో తేదీనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకోవడం, 8వ తేదీ వరకు ఆగాలని చంద్రబాబు భావించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అపాయింటెడ్ డే అయిన జూన్ రెండోతేదీన రాష్ట్ర విభజన సజావుగా సాగేందుకు అటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోను, ఇటు ఆంధ్రప్రదేశ్లోను ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలంగాణలో రాష్ట్రపతి పాలనను ఎత్తేస్తూ జూన్ రెండోతేదీనే నోటిఫికేషన్ రావచ్చు. అప్పుడే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు వీలవుతుంది. ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మార్చి ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలనలో ఉండగానే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రానికి కూడా గవర్నర్గా ప్రస్తుత గవర్న్రర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యవహరించనున్నారు.