
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నగరానికి చేరుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నగరానికి చేరుకున్నారు. కన్నలు పండుగగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోవింద్ తొలిసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు. బేగంపేట చేరుకున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం రాష్ట్రపతి రాజ్‌భవన్‌కు బయల‍్దేరారు. అక్కడ నుంచి ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి 6.10 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు వెళతారు. అనంతరం పలువురితో సమావేశమవుతారు. రాత్రికి రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళతారు. కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.