డిసెంబర్ 8న కోర్టులో హాజరుకండి | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 8న కోర్టులో హాజరుకండి

Published Mon, Nov 24 2014 3:12 AM

డిసెంబర్ 8న కోర్టులో హాజరుకండి - Sakshi

  • తెలంగాణ సీఎస్‌కు ‘సుప్రీం’ ఆదేశం
  • డీఎస్సీ-98 కేసులో టీ సర్కారుపై ఆగ్రహం
  • సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ-1998 కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇచ్చేం దుకు డిసెంబర్ 8న వ్యక్తిగతంగా హాజరుకావాలని సీఎస్ రాజీవ్‌శర్మను ఆదేశించింది. డీఎస్సీ 98పై పాఠశాల విద్యాశాఖ అనుసరించిన వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ నెల 17న వెలువడిన సుప్రీంకోర్టు ఆదేశాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. తదుపరి చర్యలపై ఏమిచేయాలో తోచక తర్జనభర్జన  పడుతున్నారు.

    సీఎస్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ, సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసే యోచనలో పాఠశాల విద్యాశాఖ ఉన్నట్టు తెలిసింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎం.జగదీశ్వర్ ప్రభుత్వంతో ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నారు.
     
    అసలేం జరిగింది?: డీఎస్సీ-1998 నియామకాల విషయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై కరీంనగర్ జిల్లాకు చెందిన గోపు మహేందర్ రెడ్డితోపాటు, పలువురు నిరుద్యోగ అభ్యర్థులు గత ఏడాది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ రంజనా గగోయ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరుపుతోంది.

    ఈ నెల 17న జరిగిన విచారణలో రాష్ట్రప్రభుత్వం తన వాదనను కోర్టుకు తెలపాల్సి ఉండగా, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ధర్మాసనం సదరు అధికారి అందజేసిన పత్రాలను తిరస్కరించడంతోపాటు.. డిసెంబర్ 8న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సీఎస్‌ను ఆదేశించింది.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement