60 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ!

PRC with 60% Fitment demands from Electricity employees unions - Sakshi

విద్యుత్‌ ఉద్యోగ సంఘాల డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగులకు 39 నుంచి 60% వరకు ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని వివిధ విద్యుత్‌ ఉద్యోగుల సంఘాల నుంచి డిమాండ్లు వచ్చాయి. వేతన సవరణ సంప్రదింపుల సంఘం చైర్మన్, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు నేతృత్వంలోని కమిటీ బుధవారం విద్యుత్‌ సౌధలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగ సంఘాలతో సమావే శమై సంప్రదింపులు జరిపింది.

19 విద్యుత్‌ ఉద్యోగుల సంఘాలతోపాటు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ ప్రతినిధులతో ఈ కమిటీ వేర్వేరుగా సమావేశమై వారి వాదనలు విన్నది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ ఉద్యోగ సంఘం టీఆర్‌వీకేఎస్‌ 39% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేయగా, మిగిలిన సంఘాలన్నీ 50 శాతానికి పైనే ఫిట్‌మెంట్‌ కోరాయి.

1104, 327 యూనియన్లు 60% ఫిట్‌మెంట్‌ను డిమాండ్‌ చేయగా, తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ 51% ఫిట్‌మెంట్‌ను అడిగింది. ఏపీలో విద్యుత్‌ ఉద్యోగులకు 25% ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో, తెలంగాణ సైతం సత్వరంగా పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయా యూని యన్లు విజ్ఞప్తి చేశాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ ఉద్యోగులకు సమానంగా రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగులకు జీత, భత్యాలు, సదుపాయాలు వర్తింపజేయాలని, అపరిమిత వైద్య చికిత్సల సదుపాయం కల్పించాలని కోరాయి.

ఈ డిమాండ్లు ఎలా న్యాయబద్ధమో వివరించాలని యూనియన్లను పీఆర్సీ కమిటీ అడిగి తెలుసు కుంది. ఈ సమావేశంలో పీఆర్సీ కమిటీ ఎలాంటి అభిప్రాయాలుకానీ, హామీలుకానీ వ్యక్తం చేయ లేదని యూనియన్ల నేతలు తెలిపారు. యూనియన్లతో తదుపరి సంప్రదింపుల తేదీని త్వరలో తెలియజేస్తామని కమిటీ తెలిపింది. ఈ చర్చల్లో పీఆర్సీ కమిటీ సభ్యులు లీత్‌ కుమార్, అశోక్‌ కుమార్, టి.శ్రీనివాస్, బీవీ రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top