మంచికి సహకారం.. చెడుపై గళం

prajakavi jayaraj special interview - Sakshi

ప్రజాకవి జయరాజ్‌తో ఇంటర్వ్యూ

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అండగా ఉంటామని ప్రజాకవి జయరాజ్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని శ్రీవాణి కళాశాలలో సోమవారం ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పటివరకు 450 పాటలు రచించగా, 150 పాటలు విప్లవ సాహిత్యంతో కూడినవని చెప్పారు. అడవిలోఅన్న, దండోర, చీకటి సూర్యులు, చలో అసెంబ్లీ సినిమాలకు పేరు ప్రఖ్యాతలు వచ్చాయన్నారు. వసంత గీతం, జ్ఞాపకాలు పుస్తక రచనలకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ప్రస్తుతం ప్రకృతి సంపద కొల్లగొట్టడంపై రాస్తున్న ‘‘మా’’ అనే పుస్తకం రెండునెలల్లో పూర్తవుతుందన్నారు. ప్రజల గొంతుకగా గళం విప్పేందుకు వెనుకాడనని స్పష్టం చేశారు.

ప్రశ్న: మీ స్వగ్రామం?
జయరాజ్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా గుమ్మనూర్‌ కుగ్రామం.

ప్రశ్న: కుటుంబ నేపథ్యం?
జయరాజ్‌: అమ్మపేరు చిన్నమ్మ, నాన్న గొడిషెల కిష్టయ్య, ఇద్దరు చెల్లెలు.

ప్రశ్న: విప్లవ సాహిత్యం రాయడానికి ప్రేరణ?
జయరాజ్‌: అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం పాటు పడాలనే తపన పాటలు రాసేలా చేసింది.

ప్రశ్న: అండర్‌ గ్రౌండ్‌కి వెళ్లి పనిచేశారా?
జయరాజ్‌: బయట ఉండే ప్రజలను చైతన్య పరిచేలా పాటలు రాశా.

ప్రశ్న: తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ?
జయరాజ్‌: తెలంగాణ రాష్ట్ర సాధనలో విప్లవకవి గద్దర్‌తో మణుగూర్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు పాదయాత్ర చేశా. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు మమేకమై వచ్చేందుకు పాటలు రాసి, గళం విప్పి చైతన్యపరిచా.  

ప్రశ్న: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై  మీ అభిప్రాయం?
జయరాజ్‌: హరితహారం, కేసీఆర్‌ కిట్, గురుకులాలు, మిషన్‌ కాకతీయ, 24గంటల విద్యుత్‌ ప్రజలకు ఉపయోగకరంగానే ఉన్నాయి.

ప్రశ్న: ఎన్నికల హామీల అమలుపై?
జయరాజ్‌: ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే ప్రజాగళం విప్పుతా..

ప్రశ్న: ప్రకృతి సంపద కొల్లగొట్టడంపై మీ అభిప్రాయం?
జయరాజ్‌: ప్రకృతి సంపదను కొల్లగొట్టడంతో అనేక అనార్థాలు వచ్చి చేరుతున్నాయి. ప్రజల సంపాదనంతా వైద్యానికే పోతుంది. ప్రకృతి పరిరక్షణకు అందరం నడుంబిగించాల్సిన అవసరముంది.

ప్రశ్న: యువతకు మీరిచ్చే సందేశం?
జయరాజ్‌: సినిమా హీరోలుగా భావించుకోవద్దు. యదార్థాన్ని గ్రహించే శక్తి యువకులకు ఉండాలి. ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకు శోకం మిగిలించొద్దు. గమ్యాన్ని నిర్ధేశించుకొని క్రమశిక్షణతో మెదిలి ఉన్న ఊరు, తల్లిదండ్రులకు పేరు తేవాలి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top