నిఘా నీడలో పాలమూరు

Police Full Protection For Loksabha Elections In Mahabubnagar - Sakshi

రౌడీషీటర్లు, పాతనేరస్తుల బైండోవర్‌ 

సరిహద్దు రహదారులపై  క్షుణ్ణంగా వాహనాల తనిఖీ   

సాక్షి,మహబూబ్‌నగర్‌ క్రైం: ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుశాఖ బందోబస్తు పటిష్టం చేసింది. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన రోడ్లపై ఉదయం, సాయంత్రం తనిఖీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వదులుతున్నారు.  

సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డెన్‌ సెర్చ్‌ 
పట్టణాలు, గ్రామాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలతో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు గ్రామాల్లో సభలు, కేంద్ర బలగాలతో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు సమాచారం అందించాలని అవగాహన కల్పిస్తున్నారు. 

రౌడీషీటర్లపై నిఘా 
రోజురోజుకు ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. హత్యలు, అపహరణ, రౌడీయిజం, దౌర్జన్యాలు, కుమ్ములాటలు, గొడవలు, బెదిరింపులు, భూ దందాలు చేసేవారితోపాటు నిత్య నేరాలకు పాల్పడుతున్న రౌడీషీటర్లు  ఎన్నికల్లో రెచ్చిపోకుండా వారిని కట్టడి చేయడానికి ముందస్తు చర్యలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళ అడ్డాలు వేయడం, మందు పార్టీలు నిర్వహించడం, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నాయకుల ప్రయత్నాల్లో సహకారం అందించడం లాంటి పనులకు పాల్పడిన వారిపై నిఘా పెట్టారు.

స్టేషన్లవారీగా రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్టర్లు, హిస్టరీ షీటర్లు వారి అనుచరులపై దృష్టి పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. వివిధ రకాల నేర ప్రవృత్తి ఉన్న రౌడీషీటర్లను బైండోవర్‌ కేసుల్లో భాగంగా పిలిచి తహసీల్దార్‌ ఎదుట హాజరు పరుస్తూ రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో వదిలిపెడుతున్నారు.  

419 మంది బైండోవర్‌ 
ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 129 కేసుల్లో 419 మంది పాత నేరస్తులను బైండోవర్‌ చేశారు. ఇందులో రౌడీషీటర్లు, లొంగిపోయిన తీవ్రవాదులు, సానుభూతిపరులు ఉన్నారు. రౌడీషీటర్లలో ఒకరిద్దరు చోటామోటా నేతలు కూడా ఉండటం గమనార్హం.జిల్లాలో అనుమతి ఉన్న తుపాకులు కల్గిన వ్యక్తులు ఉంటే తక్షణం వారి ఆయుధాలను స్థానిక పోలీసులకు అప్పగించాలని ఎస్పీ రెమారాజేశ్వరి పిలుపునివ్వడంతో 368 తుపాకులు  డిపాజిట్‌ అయ్యాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 129 కేసులు నమోదుకాగా 419 మంది వ్యక్తులను బైండోవర్‌ చేశారు. అదేవిధంగా తనిఖీల్లో 1,252 లీటర్ల మద్యం, రూ.97లక్షల 51వేల 500నగదును సీజ్‌ చేశారు. ఇప్పటి వరకు పోలీసులు 8వేల వాహనాలు తనిఖీ చేసి 180 మంది అనుమానిత డ్రైవర్ల వివరాలు సేకరించారు. 

రౌడీ షీటర్లపై నజర్‌ 
జిల్లాలో సుమారు 800 మందికిపైగా రౌడీషటర్లు ఉన్నట్లు సమాచారం. వ్యవస్థీకృత నేరాలు, దందాలు, బెదిరింపులు, హత్యలు, రౌడీయిజం, దౌర్జన్యాలు, అక్రమ వ్యాపారాలు, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. నేరాల తీవ్రత ఆధారంగా వారిపై పోలీసులు రౌడీషీట్లను తెరిచారు. ఈ ప్రక్రియ నాలుగైదు దశాబ్ధాలుగా కొనసాగుతోంది. 20ఏళ్ల కిందట రౌడీషీట్‌ నమోదై నేరాలను కొనసాగిస్తున్న వారి నుంచి కొత్తగా రౌడీషీట్‌ ఉన్న ఈ జాబితాలో ఉన్నారు. ఎన్నికలు, పండగలు, గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ముందస్తుగా వారి పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించడం బైండోవర్‌ చేయడం వంటివి కొనసాగుతుండటం సాధారణం. జిల్లాలో నేరస్థుల సర్వే నిర్వహించనప్పుడు ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారి వివరాలను సేకరించారు.

తాజా ఫొటోలతో వారిపై నమోదైన నేరాలు, శిక్షలు, ప్రస్తుత జీవన విధానం, ప్రవర్తన కుటుంబ వివరాలు సేకరించి నేరాలను బట్టి కొత్తగా హిస్టరీ షీట్‌ పొందుపరుస్తున్నారు. వీరిలో కొందరు రౌడీషీటర్లు నేరాలు మానుకుని చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. మతపరమైన అల్లర్ల సందర్భంగా రౌడీషీటర్‌గా నమోదైన వారు ఎన్నికల్లో పాల్గొన్నా వారి వివరాలను తీసుకున్నారు. జిల్లాలో కొంత మందిని పీడీ యాక్టు ఉపయోగించి జైళ్లకు పంపించారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా రౌడీషీటర్లలో ఎంత మంది జైల్లో ఉన్నారు.. ఎంతమంది బెయిల్‌పై బయట ఉన్నారన్న వివరాలను పోలీస్‌స్టేషన్‌ వారీగా సేకరించారు. రౌడీషీటర్ల ఫోన్‌ నెంబర్లు వారి అనుచరుల వివరాలు సైతం సేకరిస్తున్నారు. 

బైండోవర్‌కు రంగం సిద్ధం 
జిల్లాలో కొందరు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోగా కొందరు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి జీవితాన్ని సాగిస్తున్నారు. కొందరు ప్రాంతాలు, పోలీస్‌స్టేషన్లు పరిధి మారారు. ఇలాంటి వారు ఏయే పోలీస్‌ స్టేషన్‌ పరిధి మారారో షీటర్‌ ప్రస్తుత ఫొటోతో కలిపి పూర్తి వివరాలను సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. స్టేషన్‌ పరిధిలోని రౌడీషీటర్లు, హిస్టరీ, షీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.

నిఘా పెంచాం 
జిల్లా మొత్తం పోలీసుల నిఘాలో ఉంది. ఎవరైనా పనికట్టుకుని గొడవలు సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ప్రతి రోజు వాహనాల తనిఖీలు, గ్రామాల సందర్శన కొనసాగుతోంది. సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల పరిశీలన చేస్తున్నాం. ఎక్కడైనా గొడవలు జరిగితే వెంటనే సమాచారం అందించాలి. 
– రెమారాజేశ్వరి, మహబూబ్‌నగర్‌ ఎస్పీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top