గణపయ్యకూ జియోట్యాగింగ్‌

Police Department Geotagging for Ganesha statues Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి అపశృతి చోటుచేసుకోకుండా పోలీసుశాఖ గట్టి నిఘా ఏర్పాటుచేసింది. ప్రతీ విగ్రహానికి జియోట్యాగింగ్‌ చేస్తోంది. రెండ్రోజుల కిందట ఊరూరా.. వాడవాడలా గణనాథులు కొలువుదీరగా నిర్వాహకులు మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయితే ఈ ఏడాది నుంచి పోలీసుశాఖ ఎన్ని విగ్రహాలు, ఎన్ని మండపాలు పెడుతున్నారో పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తోంది. అనుమతి లేకుండా విగ్రహాలు పెడితే చర్యలు తీసుకుంటామని ఇదివరకే ఆదేశాలు జారీ చేయడంతో యువజన సంఘాల సభ్యులు సైతం సహకరిస్తున్నారు. జిల్లాలో అధికారికంగా 2,238 మండపాలను ఏర్పాటు చేయగా వీటి వద్ద అనుకోని ఘటనలు జరిగితే పోలీసులు నేరుగా అక్కడికి చేరుకోవడానికి జియోట్యాటింగ్‌ చేస్తున్నారు. అడ్రస్‌లు సరిగా తెలియక ఆలస్యం అవుతుంది. ఇప్పుడిక నిమిషాల్లో చేరుకునే విధంగా పోలీస్‌ శాఖ ప్రణాళిక రూపొందించింది. 

అనుమతి తప్పనిసరి 
సాంకేతికతను జోడించడానికి పోలీసులు ముందు నుంచి ప్రణాళిక ప్రకారం సాగుతున్నారు. మండపాల ఏర్పాటు చేసుకోవడానికి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని చెబుతూ వచ్చారు. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఠాణాల వారీగా వచ్చిన దరఖాస్తులను పోలీసు అధికారులు పరిశీలించి అనుమతులు ఇచ్చారు. వీటిల్లో కొలువుదీరిన విగ్రహాలకు జియోట్యాగింగ్‌ చేస్తున్నారు. సమస్త వివరాలు తమ కనుసన్నల్లో ఉంచుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. మండపాల దగ్గర కానీ, నిమజ్జన ఊరేగింపు సమయంలో గానీ అనుకోని ఘటనలు జరిగితే క్షణాల్లో అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉంటుంది. 

ఇలా చేస్తున్నారు 
పోలీస్‌ శాఖలో బ్లూకోల్ట్స్‌గా పని చేస్తున్న సిబ్బంది వద్ద ట్యాబ్‌లు ఉన్నాయి. పట్టణాలు, గ్రామాల్లోని గణపతి మండపాలను పరిశీలిస్తారు. కమిటీ నిర్వాహకుల పేర్లు, ఫోను నెంబర్లు, మండపం ఏ ప్రాంతంలో ఉందో అనే పూర్తి వివరాలను రాసుకుంటారు. ఆ తర్వాత ట్యాబ్‌లో గణపయ్య విగ్రహాన్ని ఫొటో తీస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా జియోట్యాగింగ్‌ చేస్తారు. అందులోని లొకేషన్‌ ఆప్షన్‌ను నొక్కగానే వెంటనే మండపం ఏర్పాటు చేసిన ప్రాంతంలోని గుర్తులు నమోదవుతాయి. అలాగే నిమజ్జనం ఏ రోజున, ఏ చెరువులో చేస్తారనే వివరాలను తీసుకుంటారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఇలా.. 
ఒకప్పుడు పోలీస్‌ శాఖకు రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకునే వారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ విధానం వచ్చింది. జిల్లాలో వచ్చిన 2238 దరఖాస్తులకు ఓ పోర్టల్‌ను ఓపెన్‌ చేసి అందులో వివరాలను పొందుపరుస్తున్నారు. ఇంకా చేసుకోనివారు స్మార్ట్‌ఫోన్‌లో కూడా చేసుకోవచ్చు. దరఖాస్తులను సంబంధిత పోలీస్‌స్టేషన్‌ సీఐ పరిశీలించి, డీఎస్పీ లేదా ఏఎస్పీకి పంపిస్తారు. అక్కడి నుంచి ఎస్పీ వద్దకు వెళ్తాయి.  

ప్రతీ విగ్రహానికి జియోట్యాగింగ్‌ 
జిల్లాలో ఉన్న ప్రతి విగ్రహం దగ్గరకు మా సిబ్బంది వెళ్లి విగ్రహం ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పెడుతున్నారు.  దీని వల్ల భద్రత పరంగా ఎలాంటి సమస్య ఉండదు. రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేశాం. బ్లూకోర్ట్స్, పెట్రోలింగ్, రక్షక్‌ ఇలా ప్రతి ఒక్కరు మండపం దగ్గరకు వెళ్లి పరిశీలిస్తారు. జిల్లాలో 2238 విగ్రహాలకు దరఖాస్తులు వచ్చాయి.  
–భాస్కర్, డీఎస్పీ మహబూబ్‌నగర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top