ఫోన్‌లో మాట్లాడటానికి భయపడుతున్న నేతలు..

Phone Tapping for Election Candidates In Warangal - Sakshi

 వెంటాడుతున్న కాల్‌ రికార్డింగ్‌ల భయం 

ఎన్నికల కోసం కొత్త నంబర్ల వాడకం 

నేరుగా కలిసి మంతనాలు

సాక్షి, కాజీపేట: ఈ సారి ఎన్నికలలో రాజకీయ పార్టీల నేతలు ఫోన్‌లో ఏదైనా రాజకీయపరమైన సంభాషణలు చేయాలంటే జంకుతున్నారు. ఎక్కడ కాల్‌ రికార్డు అవుతుందో.. ఎవరు ట్యాపింగ్‌ చేస్తున్నరో అనే భయంతో తమ వ్యూహన్ని మార్చుతూ నేరుగా మాట్లాడాల్సిన వ్యక్తులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. మరికొందరు కొత్త నంబర్లను వినియోగిస్తున్నారు. ఎన్నికల నియమ నిబంధనలు కఠినంగా ఉండడంతో ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల నేతలు ఎక్కడ ఎలాంటి ముప్పు ఎదురవుతుందోనని రాజకీయపరమైన అంశాల చర్చకు ఫోన్లలో స్వస్తి పలుకుతున్నారు.

తమ ఫోన్‌లో జరుగుతున్న సంభాషణలు, అంశాలు, వ్యుహలపై ప్రత్యర్థి పార్టీకి ఎక్కడ లీకవుతుందోనని ముందుగానే ఫోన్‌ వినియోగానికి దూరం ఉంటూ కలిసినప్పుడు చర్చించుకోవడం లేదా ప్రత్యేకంగా కలుస్తున్నారు. మరికొందరు ఫోన్‌ సంభాషణలలో రాజకీయపరంగా చర్చకు తావివ్వకుండా సమాధానాన్ని దాటవేస్తున్నారు. రాజకీయ పార్టీల నేతల్లో ముఖ్యులు ఫోన్ల వాడకంలో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయో అనే భయం లేకపోలేదు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న నంబర్లకు భిన్నంగా కొత్త నంబర్ల నుంచి ఫోన్లు రావడంతో అవతలి వ్యక్తులు ఇదేందన్న కొత్త నంబర్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నావు అంటే.. అది అంతే తమ్మి ఎన్నికలు అయ్యేంత వరకు ఇలానే ఉంటుందనే సమాధానాలతో వారిని తృప్తి పరుస్తున్నారు.  రోజురోజుకు వేడెక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన పార్టీల రాజకీయాల నేతలు వామ్మో ఫోన్‌లో వద్దు ఫ్లీజ్‌ అంటూ కింది స్థాయి క్యాడర్‌కు, ముఖ్యమైన నాయకులకు చెప్పడం ఇక్కడ కొసమెరుపు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top