చింతపల్లి మండలం కుర్మేడు సమీపంలోని ఇసుక తరలింపునకు బ్రేక్ పడింది. శనివారం
దేవరకొండ/చింతపల్లి : చింతపల్లి మండలం కుర్మేడు సమీపంలోని ఇసుక తరలింపునకు బ్రేక్ పడింది. శనివారం ‘సాక్షి’లో సరి‘హద్దు’ దాటుతోంది అనే శీర్షికన మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా సరిహద్దు ప్రాంతమైన కుర్మేడు నుంచి ఇసుక తరలిపోతున్న వైనంపై ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో ఇసుకాసురులు అలర్ట్ అయ్యారు. ఆధారాలు లేకుండా చేసేందుకు ఇసుక ఫిల్టర్లను నిర్వీర్యం చేసి గప్‌చుప్ అయ్యారు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం నాంపల్లి సీఐ, తహసీల్దార్ అక్కడి వాగులను పరిశీలించారు. పరిస్థితిని సమీక్షించారు. కాగా, నిన్నటివరకు అక్కడ కనిపించిన అక్రమ ఇసుక ఫిల్టర్లు నిర్వీర్యం చేసి ఉన్నాయి.
అక్కడ ఇసుక తరలింపునకు ఆధారాలను తొలగించేందుకు ఇసుకాసురులు ప్రయత్నించారు. ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించగా అక్కడున్న వారు ‘సాక్షి’తో వాదనకు దిగారు. ఇప్పటికే ఇసుక ఫిల్టర్లను తొలగించినట్లు, మూడు,నాలుగురోజుల క్రితం ఇసుక రవాణ జరిగిందని తెలుస్తోందని నాంపల్లి సీఐ ‘సాక్షి’కి ఫోన్‌చేసి తెలిపారు. కానీ ఇసుక ఫిల్టర్లు తమ పరిధిలోని కావని ఆయన పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండల పోలీసులతో తాను మాట్లాడినట్లు తెలిపారు. అయితే హైవేపై పోలీస్ గస్తీ ఉన్నందున, ఇసుక ఈ రూట్‌లో తరలిపోయే అవకాశం లేదన్నారు.