‘పాలెం’ డ్రైవర్‌ ఐదేళ్లకు పట్టుబడ్డాడు... 

Palem driver was caught for five years - Sakshi

  బస్సు ప్రమాద ఘటనలో  ఏ1 డ్రైవర్‌ అరెస్ట్‌

మంగుళూర్‌లోని ఓ రేషన్‌షాపులో వేలిముద్రల ఆధారంగా పట్టివేత

సాక్షి, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మొదటి నిందితుడైన బస్సుడ్రైవర్‌ ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. 45 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్న ఆ ప్రమాదం... ప్రైవేట్‌ బస్సు ప్రయాణమంటేనే దేశవ్యాప్తంగా వణు కు పుట్టించింది. పాలెం సమీపంలో 2013 అక్టోబర్‌ 30న ఈ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ కేసులో జబ్బార్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు డ్రైవర్‌ ఫిరోజ్‌ పాషా మొదటి ముద్దాయి. ఘటన జరిగిన నాటి నుంచి డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.  రాష్ట్ర సీఐడీ పోలీసులు ఏడాదిపాటు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆశలు వదులుకున్నారు. అతడి బంధువులను విచారించగా దేశం వదిలి పారిపోయి ఉంటాడని, ఆ కుటుంబంలో ఎవరూ కనిపించడంలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు బృందం మహబూబ్‌నగర్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో 2014లో చార్జిషీట్‌ దాఖలు చేసింది. కేసులో డ్రైవర్‌ వాంగ్మూలం కీలకమైంది. దీనితో మరోసారి ప్రయత్నిద్దామని 15 రోజుల క్రితం సీఐడీ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బెంగుళూర్, హుబ్లీ, మంగుళూర్‌ లో సీఐడీ బృందం వేట ప్రారంభించింది. ఇదే సమ యంలో పాషా పేరు మీద రేషన్‌కార్డు వివరాలున్నా యా.. అని ఆ రాష్ట్రంలో ఆరా తీయగా అతడు బతికే ఉన్నాడని, అతడి పేరిట ప్రతినెలా సరుకులు తీసుకుంటున్నాడని ప్రభుత్వరికార్డుల్లో బయటపడింది. దీంతో ప్రతినెల మొదటివారంలో మంగుళూర్‌ జిల్లా రూరల్‌ మండలంలోని ఓ రేషన్‌ దుకాణం వద్ద సీఐడీ బృందం కాపు కాసింది. సరుకులు తీసుకునేందుకు వచ్చి ఎట్టకేలకు సీఐడీ బృందానికి చిక్కాడు.  

వేలిముద్రలు తనిఖీ  
రేషన్‌సరుకులు తీసుకుంటున్న వ్యక్తి ఫిరోజ్‌ పాషా నా.. కాదా అన్న వివరాలు పోల్చుకునేందుకు అదే రేషన్‌షాపు వద్ద వేలిముద్రలు సేకరించారు. పాలెం ఘటన సందర్భంగా సేకరించిన వేలిముద్రలతో రేషన్‌ తీసుకున్న ఫిరోజ్‌ పాషా వేలిముద్రలను పోల్చి చూశారు. వేలిముద్రలు ఒకరివే అని తేలడంతో  వెం టనే అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ తరలించారు.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top