
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుల్లో ఏడాదిన్నర కిందట మొదలైన అటవీ భూముల వివాదం కొలిక్కి వచ్చింది. అవిభాజ్య మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టు నిర్మాణానికి రెవెన్యూ శాఖ కేటాయించిన భూములు తమవని, వాటిలో పనులు చేపట్టిన ఏజెన్సీలు, అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేస్తామంటూ అటవీ శాఖ చేసిన హెచ్చరికల నుంచి నీటిపారుదల శాఖ గట్టెక్కింది. పనులు జరగని భూమి అటవీ రికార్డుల్లో నమోదు కానందునే సమస్య ఉత్పన్నమైందని, ఇందులో నీటిపారుదల శాఖ తప్పిదమేమీ లేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తేల్చిచెప్పింది.
అసలు ఏమైందంటే..?
పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ఒకటో ప్యాకేజీలో నార్లాపూర్ వద్ద స్టేజ్–1 పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేయాల్సి ఉంది.రెవెన్యూశాఖ 114 ఎకరాల ను తమ దిగా పేర్కొంటూ నీటి పారుదల శాఖకు అప్పగించింది. ఏ అనుమతులు లేకుండా అటవీ స్థలంలో పనులు ఆరంభించారని అటవీ శాఖ అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో నీటిపారుదల శాఖ అండర్ గ్రౌండ్ పంప్‌హౌస్ నిర్మాణానికి పూనుకుంది. అయినా ఇక్కడా అటవీ భూమి అవసరం అవుతోంది. దీంతో ఇటీవల పర్యావరణ, అటవీ అనుమతుల కోసం ఫారెస్ట్ అడ్వయిజరీ కమిటీ ముందు హాజరవగా, ఉల్లంఘనపై ఎఫ్‌ఏసీ వివరణ కోరింది. దీంతో ప్రభుత్వం అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా ఉన్నత స్థాయి కమిటీని నియమించింది.
ఈ కమిటీ నివేదికను సిద్ధం చేసింది. పాలమూరు పనులు మొదలు పెట్టిన భూములను 1950లో అటవీ భూములుగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసినా, రెవెన్యూ రికార్డుల్లో పొందుపరచ లేదని, ఈ దృష్ట్యా వాటిని రెవెన్యూ భూముల కిందే జమకట్టి పనులకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారని కమిటీ తేల్చి చెప్పింది. ఇందులో నీటి పారుదల శాఖ అధికారుల తప్పిదం లేదని పేర్కొంది.