గ్రామీణ వారసత్వమే మన సంపద

Our wealth is rural inheritance - Sakshi

అంతరిచించిపోతున్న సంస్కృతిని కాపాడుకోవాలి

‘పరి’ కార్యక్రమంలో పాలగుమ్మి సాయినాథ్‌  

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ వారసత్వం దేశానికి వెలకట్టలేని సంపద అని ప్రముఖ జర్నలిస్టు, రచయిత, రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ పేర్కొన్నారు. ఆధునికత, నాగరికత పేరుతో అంతరించిపోతున్న గ్రామీణ సంస్కృతి, జీవనం, విలువలు, సంప్రదాయాలను కాపాడుకుని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ‘పీపుల్స్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా’(పరి) పేరుతో శనివారం జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మంథన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హస్తకళలు, చేతివృత్తులు, గ్రామీణ భాషలు, లిపులు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం, అంతరించిపోతున్న అరుదైన కళలు, భాషలు, వంటకాలు తదితరాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో ‘పీపుల్స్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా’పేరుతో డిజిటల్‌ జర్నలిజమ్‌ ఫ్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పాలగు మ్మి చెప్పారు.

దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ఔత్సాహికులు, పాత్రికేయులు, 1000 మంది వాలంటీర్లు ఇందులో భాగస్వాముల య్యారన్నారు. కనుమరుగవుతున్న గ్రామీ ణ భాషలు, లిపులు, కళలు రికార్డు చేసి వెలుగులోకి తెస్తున్నామని, లక్షకు పైగా మరాఠీ గ్రామీణ గీతాలు, జనపదాలు వెలుగులోకి తెచ్చామని, ఇంకా బ్రతికి ఉన్న కొద్దిమంది స్వాతంత్ర సమరయోదుల అనుభవాలను ప్రజలకు పరిచయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రపంచీకరణ పేరుతో గ్రామీణ విధ్వంసం ఆమోదయోగ్యం కాదన్నారు.

గ్రామీణ చేతివృత్తులు ,అరుదైన కళలను ముందు తరాలకు అందించాలనే లక్ష్యంతో లాభాపేక్ష లేకుండా ఈ వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పలు గ్రామీణ ప్రాంతాల్లోని చేనేతకారులు, కేరళ మలబార్‌లోని కళాసీలు జీవనాధారం కోల్పోయారని, 50 ఏళ్లలో 200 గ్రామీణ భాషలు వాడుకలో లేకుండా పోయాయని సాయి నాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సువిశాల భారతంలో వివిధ ముఖకవళిలకలతో ఉండే ప్రజలను పరిచయం చేయడానికి ‘ఫేస్‌ డైవర్సిటి’పేరుతో దేశంలోని అన్ని జిల్లాల నుండి జిల్లాకు ముగ్గురు చొప్పన ఫోటోలు సేకరించి అందుబాటులో ఉంచే ప్రాజెక్ట్‌ కూడా ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో మంథన్‌ ప్రతినిధి అజయ్‌గాంధీ సహ పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top