విత్తన ఎగుమతికి అవకాశాలు

Opportunities for seed export - Sakshi

‘విత్తనోత్పత్తి’ వర్క్‌షాప్‌లో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం

అధిక విత్తనోత్పత్తికి రాష్ట్రంలో అనుకూల వాతావరణం: గుత్తా

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలకు నాణ్యమైన విత్తనాల ఎగుమతికి విస్తృత అవకాశాలున్నాయని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన విత్తనోత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్‌ వర్క్‌షాప్‌ను.. రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. విత్తన ఎగుమతులతో రాష్ట్ర రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని పోచారం వెల్లడించారు. సరిహద్దులతో సంబంధం లేకుండా విత్తన ఎగుమతులు, మార్కెటింగ్‌కు అన్ని దేశాలు అంగీకరించాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర కో ఆర్డినేటర్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అధిక విత్తనోత్పత్తికి అత్యంత అనుకూల వాతావరణం ఉందన్నారు. 

దక్షిణాసియా దేశాలకు ఎగుమతి చేసే చాన్స్‌: పార్థసారథి 
వివిధ దేశాల సాగు పరిస్థితులు, పంటల తీరును ఆకళింపు చేసుకుని విత్తనోత్పత్తి చేయాలని.. భారత్, ఆఫ్రికా, ఇతర దక్షిణాసియా దేశాల్లో ఒకే రకమైన పంటలు సాగులో ఉన్న విషయాన్ని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ప్రస్తావించారు. ఆయా దేశాల్లో తెలంగాణ విత్తనాలకు మంచి మార్కెట్‌ ఉందని, ప్రపంచ విత్తన వ్యాపారంలో భారత్‌ కేవలం 4.4 శాతం వాటాను మాత్రమే కలిగి ఉందన్నారు. ఈ వాటాను పది శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. గత రెండేళ్లలో ఓఈసీడీ ద్వారా విత్తన ధ్రువీకరణ పొంది, ఎగుమతులు చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఫిలిప్పీన్స్, సూడాన్, ఈజిప్ట్‌ దేశాలకు రాష్ట్రం నుంచి విత్తనాలు ఎగుమతి అవుతున్నాయన్నారు.

దక్షిణాసియా దేశాలైన మయన్మార్, థాయ్‌లాండ్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక దేశా ల్లో సాగయ్యే పత్తి విత్తనాలు.. తెలంగాణ నుంచి ఎగుమతి చేసే వీలుందని పార్థసారథి తెలిపారు. ప్రపంచ విత్తన పరిశ్రమ వృద్ధిరేటు 7 శాతం కాగా, భారత్‌లో ఇది 17 శాతంగా ఉందని.. 2027 నాటికి జనాభా పెరుగుదలతో చైనాను భారత్‌ మించుతున్న నేపథ్యంలో ఆహార భద్రత కోసం విత్తనోత్పత్తి పెరగాల్సిన అవసరముందని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ కేశవులు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కోటేశ్వరరావు, ఇస్టా అధ్యక్షుడు క్రెయిగ్‌ మాక్‌గిల్, ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రతినిధి చికెలు బా, ఆఫ్రికాలోని వివిధ దేశాల నుంచి 35 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top