ఒకే బ్యాలెట్ | only one balet in mlc oting | Sakshi
Sakshi News home page

ఒకే బ్యాలెట్

Nov 28 2015 1:02 AM | Updated on Mar 28 2018 11:11 AM

శాసన మండలి సమరం రసవత్తరంగా మారనుంది. రెండు స్థానాలకు ఒకే బ్యాలెట్ వినియోగిస్తారనే సమాచారంతో మండలి రాజకీయం ఉత్కంఠను తలపిస్తోంది.

ఎమ్మెల్సీ ఓటింగ్ విధానంపై ఈసీ స్పష్టత
 ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు
 విజేతలుగా మొదటి ఇద్దరు అభ్యర్థులు

 శాసన మండలి సమరం రసవత్తరంగా మారనుంది. రెండు స్థానాలకు ఒకే బ్యాలెట్ వినియోగిస్తారనే సమాచారంతో మండలి రాజకీయం ఉత్కంఠను తలపిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఒకేసారి పోలింగ్ జరుగుతుండడంతో ఓటింగ్ విధానంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనుమానాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) స్పష్టతనిచ్చింది.
 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:ఏకకాలంలో రెండు స్థానాలకు జరిగే శాసనమండలి ఎన్నికల్లో ఒకే బ్యాలెట్ పేపర్ ఉంటుందని, ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో ఇప్పటివరకు రెండు సీట్లకు వేర్వేరుగా ఓటింగ్ ఉంటుందనే ప్రచారానికి తెరపడింది.
 
 పరిణామం రాజకీయ పార్టీల్లో కొత్త చర్చకు దారితీసింది. స్థానిక సంస్థల్లో సాంకేతికంగా కాంగ్రెస్‌కు మెజార్టీ ఉన్నా.. ఎన్నికల అనంతరం మారిన సమీకరణలతో బలాబ లాలు మారిపోయాయి.
 జంప్‌జిలానీలతో మారిన సంఖ్యాబలంపై అంచనాకు రావడం అధికార, విపక్ష పార్టీలకు చిక్కు ప్రశ్నగా తయారైంది. ఆపరేషన్ ఆకర్ష్‌తో గులాబీ గూటికి చాలామంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు చేరడంతో అధికార  పార్టీకి కలిసివచ్చింది. కాంగ్రెస్, టీడీపీకంటే ఎక్కు వ సభ్యులను కలిగిన ఆ పార్టీ గెలుపుపై ధీమాతో ఉంది. అయితే, ఈ రెండు పార్టీలు జతకడితే మాత్రం గులాబీ ఎదురొడ్డాల్సి ఉంటుంది. ఈ రెండు పార్టీలతోపాటు బీజేపీకి కూడా 59 మంది ఎంపీటీసీ సభ్యులు,10 మంది కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మూడు అవగాహన కుదుర్చుకుంటే టీఆర్‌ఎస్‌కు విజయానికి చమటోడాల్సిందే!
 
 రెండు పార్టీలకు క్రాస్ ఓట్ల భయం..
 తాజాగా ఈసీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యత ఓట్లలో మొదటి రెండుస్థానాల్లో నిలిచిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. రెండో అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని నిర్ణయించింది. తొలి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేరును పరిశీలిస్తోంది. రెండో స్థానాన్ని టీడీపీ-బీజేపీ కూటమికి వదిలేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రాధాన్య క్రమంలో ఎన్నికలు నిర్వహిస్తే.. సామాజికంగా వెనుకబడిన అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపనుంది. మరోవైపు క్రాసింగ్ ఓటింగ్‌తో పార్టీల ఓట్లకు గండి పడే అవకాశం లేకపోలేదు. క్రాస్‌ఓటింగ్ బెడద లేకుంటే మాత్రం రెండు స్థానాలు ఒకే పార్టీ ఖాతాలో పడడం తథ్యం. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ గనుక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పోటీలోకి దించితే పరిణామాలు మారే అవకాశం లేకపోలేదు. పార్టీలకతీతంగా ఆమె పట్ల ఒకింత సానుభూతి, బలమైన నేతగా పేరున్నందున స్థానిక సంస్థల ప్రతినిధులు సబిత వైపు మొగ్గు చూపే వీలుందని ప్రచారం జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement