‘నై’పుణ్యాభివృద్ధి   | Sakshi
Sakshi News home page

‘నై’పుణ్యాభివృద్ధి  

Published Sat, Sep 15 2018 1:58 AM

Only 2,463 was trained by SC Corporation in five years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నైపుణ్యాభివృద్ధిలో ఎస్సీ కార్పొరేషన్‌ వెనుకబడింది. నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రాయితీ రుణకల్పనతో పాటు విద్యార్హతలకు తగిన నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోటాలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ యువత కోసం భారీమొత్తంలో నిధులు కేటాయిస్తోంది. ఈక్రమంలో గత ఐదేళ్లలో పెద్ద మొత్తంలో నిధులిచ్చినప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఉదాసీనంగా వ్యవహరించింది. దీంతో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 2,463 మందికి మాత్రమే వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. అంతకుముందు ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకున్న వారి సంఖ్య మూడోవంతు కూడా లేకపోవడం గమనార్హం. 

వ్యయం ఎక్కువ... లబ్ధి తక్కువ... 
ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు తగ్గిపోతున్నాయి. ప్రైవేటు రంగంలో అవకాశాలున్న కేటగిరీలను ఎంపిక చేసుకుని గతంలో శిక్షణలు ఇవ్వడంతోపాటు ఉపాధి అవకాశాలు సైతం కల్పించేవారు. ప్రస్తుతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఉపాధి కల్పించడం కత్తిమీద సాములా మారింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణతో పాటు కచ్చితంగా ఉపాధి క ల్పించాల్సి ఉంది. దీంతో లక్ష్యసాధన ఆశాజనకంగా లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఐదేళ్ల కాలంలో రూ.7.06 కోట్లు ఖర్చు చేసి ఏకంగా 6,992 మందికి శిక్షణతో కూడిన ఉపాధిని కల్పించారు.

రాష్ట్రఏర్పాటు తర్వాత ఇప్పటివరకు రూ.10.40 కోట్లు ఖర్చు చేసి కేవలం 2,463 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చినట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఉద్యోగాలు దక్కించుకున్న వారి సంఖ్య తక్కువే. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడంలో వెనుకబాటు నమోదవుతుండటంతో ఇటీవల ఎస్సీ కార్పొరేషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచుతోంది. ఇటీవల సేవల రంగంలో ఆరోగ్య సహాయకులు, ఎయిర్‌హోస్టెస్‌ కేటగిరీలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఉపాధి అవకాశాలు అతి తక్కువ మందికే దక్కాయి. మరికొన్ని కేటగిరీల్లో శిక్షణకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తోంది. 

Advertisement
Advertisement