తెలంగాణలో ఉల్లి @170 | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఉల్లి @170

Published Fri, Dec 6 2019 2:07 AM

Onion Price Reaches Rs 170 In Telangana Due To Less Quantity - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ‘ఉల్లి బాంబ్‌’ పేలింది! గత కొంతకాలంగా సామాన్యులను బెంబేలెత్తిస్తూ ఎగబాకుతున్న ధర తాజాగా ‘ఆల్‌టైం హై’ను తాకింది. ఇప్పటివరకు సెంచరీ మార్కుకు అటు ఇటుగా పలికిన ధర గురువారం ఒక్కసారిగా ఆకాశాన్నం టింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనం తగా మొదటి రకం ఉల్లి హోల్‌సేల్‌లో క్వింటాలుకు ఏకంగా రూ.14,500 పలికింది. అంటే హోల్‌సేల్‌లోనే కిలో రూ. 145కు చేరింది.

ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు మరింతగా రేట్లను పెంచడంతో రిటైల్‌ మార్కెట్‌లో ధర రూ. 160 నుంచి రూ.170 మధ్య పలుకుతూ మధ్యతరగతి ప్రజలు ఉల్లి పేరెత్తాలంటేనే జంకేలా చేస్తోంది. రెండో రకం ఉల్లి కిలో రూ. 120, మూడో రకం ఉల్లి రూ. 80 పలుకుతుండగా నాసిరకం ఉల్లి సైతం రూ.70 పలుకుతోంది. దీంతో కిలో నుంచి 2కిలోల వరకు ఉల్లి కొందామని మార్కె ట్‌కు వెళ్తున్న వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో ఉల్లి ధరలు రూ.30 దాటలేదని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతుండటం గమనార్హం.

ఈసారి దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి రాకకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ధర ఇప్పట్లో దిగొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీనికితోడు మహారాష్ట్ర వ్యాపారులతో స్థానిక వ్యాపారులు కుమ్మక్కు కావడం, నిల్వలపై నిఘా కొరవడడం మార్కెట్‌లో మరింతగా రేట్ల అగ్గిని రాజేస్తోంది.

పొరుగున తగ్గిన సాగు వల్లే ఉల్లి ఘాటు...
తెలంగాణలో ఉల్లిసాగు ఎక్కువగా లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలపైనే రాష్ట్రం ఆధార పడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్,కర్ణాటక రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రత్యేకించి మహారాష్ట్ర నుంచి వచ్చే దిగుమతులే రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తున్నాయి. దేశంలో 60–70 శాతం ఉల్లి దిగుబడికి మహారాష్ట్రే కేంద్రంకాగా అక్కడ ఈసారి సాగు గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది 4 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా ఈ ఏడాది కేవలం రెండున్నర లక్షల హెక్టార్లకు సాగు పడిపోయింది. దీనికితోడు ఆగస్టు నుంచి మూడు నెలలపాటు కురిసిన భారీ వర్షాలతో వేసిన పంటంతా దెబ్బతిన్నది.

దీంతో ప్రస్తుత ముంబై, పుణేలోనే ఉల్లి కిలో గత 2–3 నెలలుగా రూ. 90 నుంచి రూ. 100 మధ్య పలుకుతోంది. సాధారణంగా మహారాష్ట్రలో ఉల్లి కొరత ఉంటే అక్కడి వ్యాపారులు పాకిస్తాన్, ఈజిప్ట్, చైనా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే ప్రస్తుతం పాక్‌ నుంచి ఉల్లి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో అక్కడి నుంచి సరఫరా ఆగిపోయింది. బంగ్లాదేశ్‌ను ముంచెత్తిన వరదల కారణంగా అక్కడి నుంచి సరఫరా లేదు. దీంతో ఈజిప్ట్, టర్కీ నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటున్నారు.

ఉల్లి దిగుమతి కోసం కిలోకు రూ. 6–8 ఖర్చు వస్తుండటంతో మహారాష్ట్రలోనే కిలో రూ. 110 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. మరోవైపు కర్ణాటక నుంచి సైతం ఉల్లి రాకపోవడంతో ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. ఈ నెల 2న 6,471 క్వింటాళ్ల మేర ఉల్లి రాష్ట్రానికి రాగా గురువారానికి అది 3 వేల క్వింటాళ్లకు తగ్గింది. దీంతో మూడు నాలుగు రోజుల కిందటి వరకు కిలో ఉల్లి రూ. 90–100 మధ్య ఉండగా గురువారం మలక్‌పేట మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉల్లి క్వింటాల్‌ ధర రూ.14,500 పలికింది. ఇది బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి రూ.160 నుంచి రూ.170కి విక్రయిస్తున్నారు.

కర్నూలు ఉల్లికి పెరిగిన డిమాండ్‌...
రాష్ట్రానికి కర్నూలు జిల్లా నుంచి కూడా ఉల్లి దిగుమతి జరుగుతోంది. కర్నూలులో ఏటా 87,500 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తుండగా ఈ ఏడాది అది 50 వేల ఎకరాలకు పడిపోయింది. దీనికితోడు ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలో పంట పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు సాగు చేసిన పంటలోనూ ఎకరానికి 60 క్వింటాళ్ల మేర రావాల్సిన దిగుబడి 35–40 క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో అక్కడే ధరలు అమాంతం పెరిగాయి. సెప్టెంబర్‌లో క్వింటాల్‌ ధర గరిష్టంగా రూ. 4,500కు, అక్టోబర్‌లో రూ. 4,600కు నవంబర్‌లో రూ. 5,250 పలికింది.

సాగు, దిగుబడులు తగ్గడం, స్థానిక డిమాండ్‌ అధికంగా ఉండటంతో కర్నూలు మార్కెట్‌కు గతంలో రోజూ 5–6 వేల క్వింటాళ్ల ఉల్లి పంట వచ్చేది. కానీ ప్రస్తుతం అది రోజుకు వెయ్యి క్వింటాళ్లకు తగ్గింది. దీంతో అక్కడి నుంచి రాష్ట్ర అవసరాల మేరకు ఉల్లి రావట్లేదు. మరోవైపు ప్రజలకు రాయితీపై కిలో ఉల్లి రూ. 25కే సరఫరా చేసేందుకు ఎంత ధరకైనా కొనుగోళ్లు జరపాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారులకు సూచించడంతో మార్కెట్‌ యార్డు అధికారులు, వ్యాపారులు పోటీ పడి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో ఉల్లి ధరలకు అమాంతం డిమాండ్‌ పెరిగి ధరలు నింగినంటుతున్నాయి. కర్నూలు మార్కెట్‌లో గత బుధవారం మధ్యాహ్నానికి క్వింటాలు ఉల్లి ధర గరిష్టంగా రూ. 12,510 పలికింది. ఈ ప్రభావం తెలంగాణపై పడి ఇక్కడి ధరల పెరుగుదలకు కారణమైంది.

‘మహా’ సిండికేట్‌...
రాష్ట్రంలో డిమాండ్‌ తగ్గట్టుగా లేని ఉల్లి సరఫరాను వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలో ఉల్లి నిల్వలకు కోల్డ్‌ స్టోరేజీలు లేకపోవడంతో పూర్తిగా మహారాష్ట్రపై ఆధారపడుతున్న రాష్ట్ర వ్యాపారులు అక్కడి వ్యాపారులతో సిండికేట్‌ అయ్యారు. కొనుగోలు చేసిన ఉల్లిని రాష్ట్రానికి తీసుకురాకుండా అక్కడే నిల్వ చేసి కృతిమ కొరత సృష్టిస్తున్నారు. అదీగాక తక్కువ బరువు తూగే పాత స్టాక్‌కు ధర ఉండదన్న ఉద్దేశంతో దాన్ని తీసుకురాకుండా ఎక్కువ బరువుండే తాజా స్టాక్‌నే తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర నుంచి 10 లారీలు వస్తుంటే అందులో 3 పాత స్టాక్‌ లారీలయితే 7 కొత్త స్టాక్‌వి ఉంటున్నాయి. కొత్త స్టాక్‌కు ధర పెంచేసి విక్రయాలు చేస్తున్నారు. ఉల్లి అక్రమ నిల్వలను అరికట్టేందుకు రిటైలర్లు 100 క్వింటాళ్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు 500 క్వింటాళ్లకు మించి నిల్వ చేసుకోరాదని కేంద్రం స్పష్టం చేసినా ఎక్కడా దీనిపై నిఘా ఉన్నట్లు కనిపించట్లేదు.

ఈజిప్టు ఉల్లే దిక్కు..
దేశంలో ఆకాశాన్నంటిన ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం గత నెల చివరి వారంలో టర్కీ నుంచి 11 వేల మెట్రిక్‌ టన్నులు, ఈజిప్ట్‌ నుంచి 6,090 మెట్రిక్‌ టన్నుల ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఈజిప్ట్‌ ఉల్లి ఈ నెల రెండో వారానికల్లా ముంబై చేరుతుందని కేంద్రం ప్రకటించింది. ఈజిప్ట్‌ ఉల్లిలోంచి తమకు వారానికి 100 టన్నులకు తగ్గకుండా సరఫరా చేయాలని ఇప్పటికే రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసింది.

ఈజిప్ట్‌ నుంచి వచ్చే స్టాక్‌ ఈ నెల 10కల్లా ముంబై పోర్టుకు చేరే అవకాశం ఉందని, ఆ తర్వాత మూడు రోజుల్లో రాష్ట్రానికి ఉల్లి చేరొచ్చని మార్కెటింగ్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కనీసం 500 టన్నుల ఈజిప్టు ఉల్లి తెలంగాణకు దిగుమతి అవుతుందని, అప్పడే ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. రాష్ట్రంలో నారాయణఖేడ్‌ సహా ఇతర ప్రాంతాల్లో సాగు చేసిన ఉల్లి పంట ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చిలో మార్కెట్‌లోకి వస్తుందని, అప్పటివరకు ధరాఘాతం తప్పదని చెబుతున్నారు.

ఆనియన్‌ దోశ.. పకోడిలు బంద్‌!
ఉల్లి ధరల దెబ్బకు హైదరాబాద్‌ సహా ఇతర ప్రాంతాల్లో ఉల్లి సంబంధిత వంటకాలను హోటళ్లు, తోపుడు బండ్లపై వ్యాపారులు చాలా వరకు తగ్గించేశారు. ముఖ్యంగా ఉల్లి దోశ, పకోడి, మిర్చి, పానీపూరీల్లో ఉల్లి వాడకంపై స్వీయ ఆంక్షలు పెట్టుకున్నారు. తోపుడు బండ్ల వద్ద ‘ఉల్లి మళ్లీ అడగరాదు’ అని బోర్డులు పెడుతున్నారు. ఇక బిర్యానీల్లో ఉల్లి వాడకం జరుగుతున్నా వాటితోపాటు ఇచ్చే సలాడ్‌లో ఉల్లి స్థానంలో కీరా, క్యారెట్‌లను ఇస్తున్నారు. వినియోగదారులు ఉల్లి అడిగితే సలాడ్‌కు రూ. 20–30 వసూలు చేస్తున్నారు. ఈ ప్రభావం పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపైనా పడుతోంది. హైదరాబాద్‌లోని 10 రైతు బజార్లకు మలక్‌పేట మార్కెట్‌ నుంచి 30 క్వింటాళ్లను కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఉల్లి ధర తగ్గే వరకు రైతు బజార్లకు ఉల్లి సరఫరా చేస్తామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement